
అమరావతి: ఏపీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. వాడవాడలా వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. చిన్న విగ్రహాల నుంచి భారీ విగ్రహాల వరకు మండపాలను ప్రత్యేకంగా అలంకరించారు. కొందరు మూడు రోజులకు, మరికొందరు ఐదు, తొమ్మిది రోజులకు నిమజ్జనం నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా పలు వినాయక మండపాల వద్ద లడ్డూ ప్రసాదం వేలంపాటలు నిర్వహిస్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని పార్థసారథి నగర్ సమీపంలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం వద్ద నిర్వహించిన లడ్డూ వేలంలో ముస్లిం దంపతులు చాందిని, మస్తాన్ వలి పాల్గొన్నారు.
వారు రూ.1.45 లక్షలకు లడ్డూ ప్రసాదాన్ని వేలంలో దక్కించుకున్నారు. ఈ సందర్భంగా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
