ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో అడ్మిషన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్ల ఆధారంగా కాకుండా.. అభ్యర్థుల వాస్తవ క్రీడా ప్రతిభను నిర్ధారించేందుకు స్కిల్ టెస్ట్ తప్పనిసరి చేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలో జారీ చేయనుంది.

స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం లేదా అడ్మిషన్ పొందాలంటే అభ్యర్థి సంబంధిత క్రీడకు సంబంధించిన సర్టిఫికెట్‌తో పాటు రాత పరీక్షలో అర్హత సాధించాలి. అలాగే తప్పనిసరిగా స్కిల్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అభ్యర్థి సమర్పించిన సర్టిఫికెట్‌లో పేర్కొన్న క్రీడలోనే నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు.

స్కిల్ టెస్ట్‌ను పారదర్శకంగా నిర్వహించేందుకు స్పోర్ట్స్ టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్, ఫిజికల్ డైరెక్టర్లు, శాప్ అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థి క్రీడా నైపుణ్యం, స్థాయిని ఈ కమిటీ అంచనా వేసి అర్హతను నిర్ణయిస్తుంది. నకిలీ సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగాలు, అడ్మిషన్లు పొందకుండా అడ్డుకోవడంతో పాటు ప్రతిభ ఉన్న క్రీడాకారులకు అవకాశం కల్పించడమే ఈ విధానం ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది.

సాంఘిక సంక్షేమ శాఖ సర్వీస్ రూల్స్‌లో సవరణలు

ఇదిలా ఉండగా.. ఏపీ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ సర్వీస్ రూల్స్‌లో పలు మార్పులు చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులు-2025కు అనుగుణంగా 1996 నాటి సాంఘిక సంక్షేమ సర్వీస్ రూల్స్‌ను సవరించింది.

కొత్త సవరణల్లో భాగంగా అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ (ASWO) పోస్టును గెజిటెడ్ హోదా కలిగిన కేటగిరీలో చేర్చారు. అలాగే వార్డెన్/మేట్రన్ గ్రేడ్-1, గ్రేడ్-2 పోస్టులను ఇకపై హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1, గ్రేడ్-2గా మార్చేలా నిబంధనలు సవరించారు.

అదేవిధంగా ఏపీలోని రవాణా సబార్డినేట్ సర్వీస్ రూల్స్-2009లోనూ మార్పులు చేశారు. పదోన్నతి పొందాలంటే కింది స్థాయి క్యాడర్‌లో కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండటం తప్పనిసరి చేస్తూ నిబంధనలు సవరించారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *