
పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ మధ్య గత ఏడు నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు రోజురోజుకూ మరింత ముదురుతున్నాయి. బాంబులు, యుద్ధ విమానాలతో సాగుతున్న పోరుకు తోడు.. ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం, సోషల్ మీడియాలో మీమ్స్ వార్ కూడా హాట్ టాపిక్‌గా మారింది.
ఈ క్రమంలో జింబాబ్వేలోని ఇరాన్ దౌత్య కార్యాలయం చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. అమెరికాకు కౌంటర్‌గా టాలీవుడ్ హీరో బాలయ్య బాబు సినిమాలోని ఓ పవర్ఫుల్ డైలాగ్‌ను ఉపయోగిస్తూ ఇరాన్ దౌత్య కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. బాలయ్య డైలాగ్‌ను అంతర్జాతీయ స్థాయిలో ఇలా ఉపయోగించడంపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. “బాలయ్య రేంజ్ ఇదీ!” అంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ కూడా అదే స్థాయిలో ఘాటైన సమాధానం ఇస్తోంది. తమ దేశంపై దాడికి ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని ఇరాన్ స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలో ఇరాన్ రాయబార కార్యాలయం చేసిన ఓ సోషల్ మీడియా పోస్టు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన సూపర్‌హిట్ చిత్రం ‘భగవంత్ కేసరి’లోని ఓ డైలాగ్‌ను ఇరాన్ తన వాదనకు ఉపయోగించుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశానికి సంబంధించిన వీడియోను జింబాబ్వేలోని ఇరాన్ రాయబార కార్యాలయం తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది.
“ట్రంప్ ఇరాన్‌ను తుడిచిపెట్టేస్తానని అంటున్నాడు. కానీ ఇరాన్ బలహీనమైన దేశం కాదని అతడికి తెలుసు. ఎందుకంటే హాలీవుడ్‌కు బదులుగా వారు ఇటీవల బాలీవుడ్ చూస్తున్నారని మాకు తెలుసు” అంటూ వ్యంగ్యంగా పేర్కొంది.
బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’లోని డైలాగ్‌ను అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ రాయబార కార్యాలయం ఉపయోగించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఇరాన్ బలహీనంగా లేదనే సందేశాన్ని ఇవ్వడానికి నందమూరి బాలకృష్ణ నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ సీన్‌ను మీమ్‌గా ఉపయోగించుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఇరాన్ ఎంబసీ పేర్కొన్నట్లుగా ఇది బాలీవుడ్ సినిమా సీన్ కాదని, తెలుగు చిత్రంలోని సన్నివేశమని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
ఏదేమైనా, భౌగోళిక రాజకీయ పరిణామాల మధ్య ఓ తెలుగు సినిమా యాక్షన్ సీన్ అంతర్జాతీయ స్థాయిలో చోటుచేసుకున్న ‘డిప్లొమాటిక్ మీమ్ వార్’లో భాగం కావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
