
కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి సాగరతీరంలో ఏర్పాటు చేసిన 63 అడుగుల మహాగణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వినాయకుడి చేతిలో ఉంచిన 630 కిలోల భారీ లడ్డూకు నిర్వహించిన వేలంలో రికార్డు ధర లభించింది. మచిలీపట్నానికి చెందిన ఎఫ్సీఎస్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత గుమ్మడి భవానీ శంకర్ రూ.25 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.
ఉత్సవ కమిటీ కోశాధికారి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో లడ్డూ వేలం నిర్వహించారు. రూ.63 వేల ప్రారంభ ధరతో మొదలైన వేలంలో ఆఫ్లైన్లో 150 మందికిపైగా, ఆన్లైన్లో 410 మందికిపైగా పాల్గొన్నారు. మొత్తం 600 మందికిపైగా వేలంలో పోటీ పడగా.. భవానీ శంకర్ ఆన్లైన్లో రూ.25 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు.
మంగినపూడి తీరంలో మహాగణపతి లడ్డూ వేలం వర్చువల్గా నిర్వహించినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. 630 కిలోల లడ్డూకు రూ.25 లక్షల ధర పలకడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
చిత్తూరులో 1.5 టన్నుల లడ్డూకు రూ.9 లక్షలు
చిత్తూరు డీఐ రోడ్డులో ఏర్పాటు చేసిన వినాయకుడికి 1.5 టన్నుల భారీ లడ్డూను నైవేద్యంగా సమర్పించారు. వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం క్రేన్ సాయంతో లడ్డూను విగ్రహం ముందు ఉంచి వేలం నిర్వహించారు.
ఈ వేలంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తన అనుచరులతో కలిసి పాల్గొని రూ.9,00,116కు లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం లడ్డూ ప్రసాదాన్ని భక్తులు, నగరవాసులకు పంచిపెట్టారు.
నూజివీడులో రూ.15.30 లక్షలకు లడ్డూ
ఏలూరు జిల్లా నూజివీడు మండలం మెట్టగూడెంలోనూ వినాయకుడి లడ్డూకు వేలం నిర్వహించారు. శ్రీసాయి గౌతమ్ ఫుడ్స్ అధినేత వెలివెల కనకదుర్గారావు (కన్నా) రూ.15,30,999కు లడ్డూను దక్కించుకున్నారు.
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ లడ్డూలకు వేలం పాటలు నిర్వహించగా.. భక్తులు, వ్యాపారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
