ఆంధ్రప్రదేశ్‌లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా సివిల్ ఎస్సైలు, పోలీసు కానిస్టేబుళ్లుగా నియమితులైన వారి గత సర్వీసు సీనియారిటీ, ఇతర ప్రయోజనాలపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో ఆర్‌ఎస్సైలు (రిజర్వ్ సబ్‌ఇన్‌స్పెక్టర్లు), ఏఆర్‌పీసీలుగా (ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసు కానిస్టేబుళ్లు) పనిచేసిన కాలాన్ని.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా సివిల్ ఎస్సైలు, కానిస్టేబుళ్లుగా నియమితులైన తర్వాత సీనియారిటీ కోసం పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ సుభేందు సామంతలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఈ అంశంపై గతంలో ఏపీఏటీ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.

ఏపీ పోలీస్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్‌లోని రూల్ 15(సీ) ప్రకారం.. బదిలీ ద్వారా సివిల్ ఎస్సైగా నియమితులైన వారికి మాత్రమే పాత సర్వీసు సీనియారిటీని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుందని ధర్మాసనం తెలిపింది. అయితే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఎంపికైన వారి సీనియారిటీని వారు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి లెక్కించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

గతంలో ఆర్‌ఎస్సైలుగా పనిచేసిన దుర్గారావు, మరికొందరు 2004లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఏలూరు రేంజ్‌లో సివిల్ ఎస్సైలుగా ఎంపికయ్యారు. తమ గత సర్వీసు కాలాన్ని కూడా సీనియారిటీలో కలపాలని కోరుతూ వారు ఏపీఏటీని ఆశ్రయించారు. ఇదే విధంగా అనంతపురం జిల్లాకు చెందిన కొందరు ఏఆర్‌పీసీలు కూడా తమ పాత సర్వీసును సివిల్ కానిస్టేబుల్ సర్వీసుతో కలపాలని కోరారు.

ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ఏపీఏటీ 2013, 2014లో తీర్పులు ఇస్తూ.. ఆర్‌ఎస్సైల నుంచి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా సివిల్ ఎస్సైలుగా, ఏఆర్‌పీసీల నుంచి సివిల్ కానిస్టేబుళ్లుగా నియమితులైన వారికి గత సర్వీసు కాలాన్ని సీనియారిటీ లెక్కింపులో పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది.

ఏపీఏటీ తీర్పులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, ఏలూరు రేంజ్ డీఐజీ, అనంతపురం జిల్లా ఎస్పీ హైకోర్టును ఆశ్రయించారు. 2014, 2016లో దాఖలైన ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా నియమితులైన వారికి పాత సర్వీసును సీనియారిటీ కోసం పరిగణనలోకి తీసుకోరాదని తాజాగా స్పష్టం చేసింది.

By Ramya