ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు యూలర్ ఈవీ సంస్థ ముందుకొచ్చింది. రాష్ట్రంలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఈ ప్రతిపాదనలపై రాష్ట్ర అధికారులు యూలర్ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు.

తిరుపతిలో లేదా రాయలసీమలోని మరో అనుకూల ప్రాంతంలో యూనిట్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని సంస్థ పరిశీలిస్తోంది. ఈ ప్లాంట్ ద్వారా రాబోయే పదేళ్లలో సుమారు 35 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు సంస్థ తన ప్రతిపాదనల్లో పేర్కొంది.

ఈ యూనిట్‌లో ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని యూలర్ ఈవీ యోచిస్తోంది. గరిష్ఠంగా 1.5 టన్నుల సామర్థ్యం కలిగిన సరకు రవాణా వాహనాలను కూడా ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం హర్యానాలో యూలర్ సంస్థ తయారీ, పరిశోధన కేంద్రాన్ని నిర్వహిస్తోంది.

ఈ ఏడాది మార్చిలో ఈక్విటీ రూపంలో రూ.4,375 కోట్లు, రుణ రూపంలో మరో రూ.250 కోట్ల నిధులను సమీకరించినట్లు సంస్థ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి వివరించారు. యూలర్ ఈవీకి లైట్‌రాక్ ప్రధాన పెట్టుబడిదారుగా ఉండగా.. హీరో మోటోకార్ప్, బ్లూమ్ వెంచర్స్ తదితర సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. బ్లాక్‌సాయిల్, ట్రైఫెక్టా, ఇన్నోవేన్, ఆల్జీరియా క్యాపిటల్ సంస్థలు రుణ సదుపాయం కల్పించాయి.

దక్షిణ భారత మార్కెట్‌లో విస్తరించేందుకు యూలర్ ఈవీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఏపీలో కొత్త తయారీ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే అవేరా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ యూనిట్‌తో పాటు ఐజిప్ ఆటోస్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.

అమరావతిలో ఎడ్జ్ డేటా సెంటర్

ఇదిలా ఉండగా.. అమరావతిలో ప్రభుత్వంతో పాటు వివిధ సంస్థల అవసరాల కోసం చిన్న స్థాయి ఎడ్జ్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఆర్‌డీఏ టెండర్లు ఆహ్వానించింది.

నిడమర్రు పరిధిలో ఇందుకోసం 1.8 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. టెండర్లలో పాల్గొనే సంస్థలు అక్టోబర్ 10వ తేదీలోగా బిడ్‌లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎంపికైన సంస్థతో సీఆర్‌డీఏ 33 ఏళ్ల పాటు లీజు ఒప్పందం చేసుకోనుంది.

By Ramya