యానాం మార్కెట్లో అరుదైన చీరమేను చేపల సందడి మొదలైంది. శీతాకాలం ప్రారంభం కావడంతో ఈ చేపలు పెద్దఎత్తున మార్కెట్‌కు చేరుతున్నాయి. దీంతో కొనుగోలుదారులు, స్థానిక వ్యాపారుల్లో ఆసక్తి నెలకొంది.
తాజాగా మొదటి బకెట్ చీరమేను చేపలు ఏకంగా రూ.26,000కు వేలం పలికాయి. ప్రస్తుతం సేరు ధర సుమారు రూ.4,000 వరకు పలుకుతోంది. సాధారణంగా తూర్పు గాలులు వీచే సమయంలో ఈ చేపలు ఎక్కువగా లభిస్తాయని స్థానికులు చెబుతున్నారు.
చీరమేను చేపలతో స్థానికులు రుచికరమైన వంటకాలు తయారు చేసుకుంటారు. ముఖ్యంగా సీజన్ ప్రారంభం కావడంతో వీటికి డిమాండ్ పెరిగింది. దీపావళి వరకు ఈ చేపల లభ్యత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

యానాం: శీతాకాలం ప్రారంభం కావడంతో యానాం మార్కెట్లో అరుదైన చీరమేను చేపల సందడి మొదలైంది. మాంసాహార ప్రియులు ఎంతో ఇష్టంగా తినే ఈ చేపలు ఈ సీజన్లో తొలిసారిగా మార్కెట్‌కు చేరడంతో కొనుగోలుదారుల ఆసక్తి పెరిగింది. తొలి బకెట్ చీరమేను ఏకంగా రూ.26 వేల ధరకు వేలంలో అమ్ముడవడం విశేషం.
స్థానిక మత్స్యకార మహిళ నాటి పార్వతి ఈ బకెట్‌ను వేలంలో దక్కించుకున్నారు. అనంతరం చీరమేనును సేరు రూ.4 వేల చొప్పున విక్రయిస్తున్నట్లు మత్స్యకారులు తెలిపారు. దీంతో చీరమేను కొనుగోలు చేసేందుకు మార్కెట్‌కు వచ్చిన మాంసాహార ప్రియుల సంఖ్య పెరుగుతోంది.
స్థానికుల సమాచారం ప్రకారం తూర్పు గాలులు వీచే సమయంలో చీరమేను ఎక్కువగా లభిస్తుంది. సాధారణంగా నీటి అడుగు భాగంలో ఉండే ఈ చిన్న చేపలు తూర్పు గాలుల ప్రభావంతో నీటి ఉపరితలానికి చేరుకుంటాయని మత్స్యకారులు చెబుతున్నారు. చేపలు చిన్న పరిమాణంలో ఉండటంతో గతంలో చీరల సాయంతో పట్టుకునేవారని, ప్రస్తుతం ప్రత్యేకంగా తయారు చేసిన సన్నని వలలను ఉపయోగించి వేట సాగిస్తున్నామని వారు వివరించారు.
ఇటీవల తుపాన్ ప్రభావంతో తూర్పు గాలులు బలంగా వీస్తుండటంతో పలువురు మత్స్యకారులు చీరమేను వేటకు వెళ్తున్నారు. సీజన్ ప్రారంభం కావడంతో రానున్న రోజుల్లో మార్కెట్‌కు మరింతగా చీరమేను చేరే అవకాశం ఉందని మత్స్యకారులు భావిస్తున్నారు.
చీరమేనుతో స్థానికులు వివిధ రకాల వంటకాలను తయారు చేసుకుంటారు. ముఖ్యంగా చింతకాయ, నిమ్మకాయతో ఇగురు, గారెలు వంటి వంటకాలను చేసుకుని ఆరగిస్తారు. ప్రస్తుతం ప్రారంభమైన సీజన్ దీపావళి వరకు కొనసాగుతుందని, ఈ సమయంలో చీరమేను లభ్యత పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. దీంతో మత్స్యకారులు ప్రత్యేక వలలతో వేటను కొనసాగించనున్నారు.
