
తెనాలి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత అన్నాబత్తుని శివకుమార్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. ఓ ఫైనాన్స్ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెనాలి వన్‌టౌన్ పోలీసులు శివకుమార్‌తో పాటు ఆయన భార్య, మరో వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరులోని ఏపీజే ఇంపెక్స్ సంస్థ ధాన్యం, మొక్కజొన్న, ఉల్లి తదితర ఆహార ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతి వ్యాపారం చేస్తోంది. ఈ సంస్థకు శివకుమార్ భార్య మేనేజింగ్ పార్టనర్‌గా, శ్రీనివాస్ మరో పార్టనర్‌గా ఉన్నారు. 2019 అక్టోబర్‌లో విజయవాడకు చెందిన ఓ ఫైనాన్స్ సంస్థ నుంచి ఇంపెక్స్ రూ.3 కోట్ల రుణం తీసుకుంది. ఈ రుణానికి శివకుమార్ గ్యారంటీగా ఉండటంతో తెనాలిలో తన పేరుతో ఉన్న 1,200 గజాల స్థలాన్ని తనఖాగా పెట్టారు.
అయితే 2021 నుంచి రుణ వాయిదాలు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సంస్థ రుణ రికవరీ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో తనఖా పెట్టిన స్థలానికి సంబంధించి పత్రాలను పరిశీలించగా, అందులో 500 గజాల స్థలాన్ని 2012లోనే ఇద్దరికి 250 గజాల చొప్పున విక్రయించినట్లు గుర్తించినట్లు ఫైనాన్స్ సంస్థ ఆరోపించింది. దీంతో శివకుమార్‌కు వాస్తవంగా 700 గజాల స్థలంపైనే హక్కు ఉందని పేర్కొంది.
తప్పుడు పత్రాలు సమర్పించి రుణం పొందారని, వాస్తవాలను దాచారని ఫైనాన్స్ సంస్థ ఫిర్యాదులో ఆరోపించింది. వడ్డీతో కలిపి బకాయి మొత్తం రూ.5.62 కోట్లకు చేరిందని తెలిపింది.
ఫిర్యాదు ఆధారంగా శివకుమార్, ఆయన భార్య, మరో వ్యక్తిపై బీఎన్ఎస్లోని 318(4), 338, 336(3), 340(2), 6/3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.
