
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. 12 వరద ప్రభావిత జిల్లాలకు సహాయక చర్యల కోసం రూ.16 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పునరావాస కేంద్రాల్లోని కుటుంబాలకు కనిష్ఠంగా రూ.1,000 నుంచి గరిష్ఠంగా రూ.3,000 వరకు ఆర్థిక సాయం అందించనున్నారు.
శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున కేటాయించారు. పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు రూ.కోటి చొప్పున నిధులు విడుదల చేశారు.
నిత్యావసర సరుకులు ఉచితం
వరద ప్రభావిత కుటుంబాలకు 25 కిలోల బియ్యంతో పాటు కిలో చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పంచదార, ఒక లీటర్ పామాయిల్ ఉచితంగా పంపిణీ చేయనున్నారు. గత ఐదు రోజులుగా సముద్రంలోకి వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల బియ్యం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.
వరద పరిస్థితిపై సీఎం సమీక్ష
ముఖ్యమంత్రి చంద్రబాబు వర్షాలు, వరద పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్రలో నదీ ప్రవాహాలు, ముంపు పరిస్థితిపై మంత్రి అచ్చెన్నాయుడు సీఎంకు వివరించారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసి, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
కృష్ణా, గోదావరి, నాగావళి, వంశధార నదీ పరివాహక ప్రాంతాల్లో పెరుగుతున్న నీటి ప్రవాహాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్థానికంగా వచ్చే వరద నీటిని సాధ్యమైనంత మేర నిల్వ చేసుకునేలా చర్యలు చేపట్టాలని, రిజర్వాయర్లను నింపేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.
