
గతేడాది తమిళనాడులోని కరూర్‌లో టీవీకే నిర్వహించిన రాజకీయ సభలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని, చర్చను రేకెత్తించింది. ఈ విషాద ఘటనకు ఏడాది పూర్తైన సందర్భంగా తమిళనాడు సీఎం విజయ్ మృతులకు నివాళులు అర్పించారు.
కరూర్ ప్రజలతో పాటు టీవీకే సభ్యులు కూడా ఈ విషాదం నుంచి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు. తమ ఆప్తులను కోల్పోయిన కుటుంబాలు ఒకరికొకరు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా, ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే అంశంపై కొనసాగుతున్న న్యాయపరమైన ప్రక్రియ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
తమిళనాడును విషాదంలో ముంచెత్తిన కరూర్ తొక్కిసలాట ఘటనకు ఏడాది పూర్తైంది. 2025 సెప్టెంబర్ 27న కరూర్‌లోని వెలుసామిపురంలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) నిర్వహించిన రాజకీయ సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన తొలి వర్ధంతి సందర్భంగా టీవీకే అధ్యక్షుడు జోసెఫ్ విజయ్ మృతులకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన చేసిన ఎక్స్ పోస్టు తీవ్ర భావోద్వేగానికి గురిచేసేలా ఉంది. 2025 సెప్టెంబర్ 27న జరిగిన ఘటన తన జీవితంతో పాటు కరూర్ ప్రజలు, యావత్ తమిళనాడు ప్రజల మనసుల్లో చెరిగిపోని ముద్ర వేసిందని విజయ్ పేర్కొన్నారు. ఆ రోజు జరిగిన విషాదం తన జీవితంలో ఎప్పటికీ మానని గాయంగా, తగ్గని వేదనగా మిగిలిపోయిందని తెలిపారు.
కరూర్ ప్రజలతో పాటు టీవీకే కార్యకర్తలు కూడా ఇప్పటికీ మాటల్లో వర్ణించలేని దుఃఖాన్ని మోస్తున్నారని విజయ్ అన్నారు. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు పరస్పరం ఓదార్పుగా, అండగా, ధైర్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. తమ జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచిపోయే మృతులందరికీ హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొంటూ, బాధిత కుటుంబాలకు తన సంఘీభావాన్ని తెలిపారు.
2025 సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్‌లో టీవీకే అధినేత విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో సభా ప్రాంగణం వద్ద భారీగా జనం గుమిగూడారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. కరూర్ తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.
ఆ తర్వాత జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయం సాధించి, విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ.. కరూర్ ఘటనకు సంబంధించిన సహాయక చర్యలు, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అందించిన పరిహారం, పునరావాస చర్యలు ఇప్పటికీ చర్చనీయాంశంగానే కొనసాగుతున్నాయి.
