
దేశంలోనే తొలిసారిగా ఎల్ఎన్జీతో నడిచే రైలు పట్టాలెక్కింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రైలును ప్రారంభించారు. డీజిల్‌తో పాటు ఎల్ఎన్జీని ఇంధనంగా వినియోగించే ఈ రైలులో 1,400 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన రెండు డ్రైవింగ్ పవర్ కార్లను ఏర్పాటు చేశారు.
ఈ సాంకేతికత ద్వారా డీజిల్ వినియోగంలో దాదాపు 40 శాతం వరకు ఎల్ఎన్జీతో భర్తీ చేసే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు. ఇంధన వ్యయాన్ని తగ్గించడంతో పాటు ఉద్గారాలను నియంత్రించడమే లక్ష్యంగా ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టును చేపట్టారు.
రైల్వే రంగంలో ఆధునీకరణ, కొత్త సాంకేతికతల వినియోగంపై అమిత్ షా మాట్లాడారు. ఇదే సందర్భంగా కాంగ్రెస్‌పై కూడా ఆయన రాజకీయ విమర్శలు చేశారు.
భారతీయ రైల్వేలో ప్రత్యామ్నాయ ఇంధన వినియోగానికి మరో కీలక ముందడుగు పడింది. దేశంలో తొలిసారిగా ఎల్ఎన్జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) ఆధారిత డ్యూయల్ ఫ్యూయల్ రైలును గుజరాత్‌లోని సబర్మతి స్టేషన్ నుంచి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరయ్యారు.
డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ ఇంధనాలను రైల్వేలో వినియోగించే లక్ష్యంతో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ రైలులో పూర్తిగా ఎల్ఎన్జీతో పనిచేసే ఇంజిన్‌కు బదులుగా డీజిల్-ఎల్ఎన్జీ డ్యూయల్ ఫ్యూయల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సబర్మతి ఇంటిగ్రేటెడ్ కోచింగ్ డిపోలోని 1,400 హార్స్పవర్ సామర్థ్యం కలిగిన రెండు డ్రైవింగ్ పవర్ కార్లను ఎల్ఎన్జీ టెక్నాలజీకి అనుగుణంగా మార్పులు చేశారు.
రైల్వే అధికారుల ప్రకారం, ఈ డ్యూయల్ ఫ్యూయల్ టెక్నాలజీ ద్వారా డీజిల్ వినియోగంలో సుమారు 40 శాతం వరకు ఎల్ఎన్జీతో భర్తీ చేయవచ్చు. ఇప్పటికే ఈ సాంకేతికతపై 2,000 కిలోమీటర్లకు పైగా ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించారు.
ఎల్ఎన్జీ వినియోగం వల్ల డీజిల్ ఖర్చుతో పాటు మొత్తం ఇంధన వ్యయం, ఉద్గారాలను కూడా తగ్గించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ట్రయల్ డేటా ప్రకారం, ఒక్క డ్రైవింగ్ పవర్ కారుకు ఏడాదికి సుమారు రూ.11.9 లక్షల వరకు ఇంధన వ్యయం ఆదా కావచ్చు. అదే 8 కోచ్‌ల రేక్‌కు సంవత్సరానికి సుమారు రూ.23.9 లక్షల వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని రైల్వే అధికారులు వెల్లడించారు.
ఈ ప్రయోగం విజయవంతమైతే, భవిష్యత్తులో భారతీయ రైల్వేలో ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని మరింత విస్తరించేందుకు మార్గం సుగమం కానుంది.
ఎల్ఎన్జీ ఆధారిత డ్యూయల్ ఫ్యూయల్ విధానం ద్వారా కార్బన్ డయాక్సైడ్ (CO₂), నైట్రోజన్ ఆక్సైడ్లు (NOx), పార్టిక్యులేట్ మ్యాటర్ వంటి కాలుష్య ఉద్గారాలను తగ్గించే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని పెంచడం ద్వారా పర్యావరణంపై రైల్వేల ప్రభావాన్ని తగ్గించే దిశగా ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
సబర్మతిలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారతీయ రైల్వేల్లో ఆధునీకరణకు పెద్దపీట వేసిందని అన్నారు. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, ర్యాపిడ్ రైల్ వ్యవస్థ, ఆధునిక రైల్వే స్టేషన్ల నిర్మాణం వంటి పలు కీలక ప్రాజెక్టులు మోదీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమయ్యాయని ఆయన గుర్తు చేశారు.
