విజయవాడకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తామని టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. నగరవాసులంతా ఉత్సవాల్లో పాల్గొని ఆస్వాదించాలని ఆయన పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర లక్ష్యంతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలో స్వచ్ఛ మారథాన్ నిర్వహించారు.

‘క్లీన్ సొసైటీ గ్రీన్ సొసైటీ’ నినాదంతో జరిగిన ఈ మారథాన్‌ను ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, బోండా సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.

మారథాన్ సందర్భంగా నిర్వహించిన జుంబా డ్యాన్స్ యువతను ఆకట్టుకుంది. 5కే, 10కే రన్‌లలో 22 రాష్ట్రాలకు చెందిన యువత ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయవాడ ఉత్సవ్ 2.0 కర్టన్ రైజర్ వీడియోను భారీ స్క్రీన్‌పై ప్రదర్శించారు. వీడియో ప్రదర్శనకు యువత ప్రజల నుంచి హర్షధ్వానాలతో మంచి స్పందన లభించింది.

ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ విజయవాడలో ఏ కార్యక్రమం జరిగినా నగరవాసుల సహకారంతో విజయవంతం అవుతుందని అన్నారు. విజయవాడ ఉత్సవ్ స్వచ్ఛ మారథాన్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోందని పేర్కొన్నారు. 22 రాష్ట్రాల నుంచి స్వచ్ఛ మారథాన్‌కు రిజిస్ట్రేషన్లు రావడం విజయవాడకు గర్వకారణమన్నారు.

గత ఏడాది విజయవాడ ఉత్సవ్‌కు ఉపరాష్ట్రపతిని ఆహ్వానించామని ఈసారి రాష్ట్రపతి హాజరుకానున్నారని ఎంపీ తెలిపారు. అక్టోబర్ 14, 15 తేదీల్లో రాష్ట్రపతి విజయవాడ పర్యటన ఖరారైందని వెల్లడించారు. విజయవాడ ఉత్సవ్‌ను పున్నమి ఘాట్, మాకినేని బసవపున్నయ్య స్టేడియం, సిద్ధార్థ కాలేజీ వేదికలుగా నిర్వహించనున్నట్లు కేశినేని శివనాథ్ తెలిపారు.

By Rajini