విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా.. నారా రోహిత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకటేష్, త్రివిక్రమ్ తొలిసారి కలిసి పనిచేస్తుండటంతో సినిమాపై మొదటి నుంచే మంచి ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఈ మూవీ కథకు సంబంధించిన పాత రూమర్లు మరోసారి సోషల్ మీడియాలో చర్చకు వచ్చాయి.

‘బ్లాస్ట్’తో కథకు పోలికలు ఉన్నాయా?

గతంలో ‘ఆదర్శ కుటుంబం’ కథకు తమిళ, తెలుగు భాషల్లో సర్‌ప్రైజ్ హిట్‌గా నిలిచిన ‘బ్లాస్ట్’ చిత్రానికి కొన్ని పోలికలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. అంతేకాదు.. ఆ సినిమా కథతో సారూప్యతలు ఉండటంతో ‘ఏకే 47’ షూటింగ్‌ను కొంతకాలం నిలిపివేసి స్క్రిప్ట్‌లో మార్పులు చేశారనే వార్తలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే ఈ ప్రచారాలపై చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక క్లారిటీ ఇవ్వలేదు.

త్రివిక్రమ్ చెప్పిన ‘బ్లాక్ స్వాన్’ కాన్సెప్ట్

తాజాగా దర్శకుడు త్రివిక్రమ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ పాత రూమర్లకు మరోసారి ప్రాధాన్యం తీసుకొచ్చాయి. సినిమాలో ‘బ్లాక్ స్వాన్’ ఎఫెక్ట్‌ను ప్రస్తావించిన ఆయన.. అనుకోని వ్యక్తులు లేదా ఊహించని పరిణామాలు ఒక వ్యవస్థలోకి ప్రవేశించి, అప్పటివరకు ఉన్న పరిస్థితులను పూర్తిగా మార్చేయడాన్ని ‘బ్లాక్ స్వాన్’గా వివరించారు.

‘బ్లాస్ట్’ కథలోనూ ఓ మధ్యతరగతి కుటుంబం అనుకోకుండా ఓ బడా వ్యాపారవేత్త ప్లాన్‌లో భాగం కావడంతో కథ కీలక మలుపులు తిరుగుతుంది. దీంతో త్రివిక్రమ్ చెప్పిన ‘బ్లాక్ స్వాన్’ కాన్సెప్ట్‌కు, ‘బ్లాస్ట్’లోని కొన్ని కథా అంశాలకు పోలికలు ఉన్నాయంటూ నెటిజన్లు చర్చిస్తున్నారు.

అయితే ఈ రెండు సినిమాల కథల మధ్య నిజంగా ఏమైనా పోలికలు ఉన్నాయా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేం. ఈ ప్రచారాలపై కూడా అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేదు. కానీ ఈ చర్చ మాత్రం ‘ఆదర్శ కుటుంబం’పై ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. త్రివిక్రమ్ ఎలాంటి కథను సిద్ధం చేశారు? ‘బ్లాక్ స్వాన్’ ఎఫెక్ట్‌ను సినిమాలో ఎలా చూపించారు? గతంలో వచ్చిన రూమర్లకు అసలు ఆధారం ఉందా? అనే ప్రశ్నలకు సినిమా విడుదలైన తర్వాతే సమాధానం దొరకనుంది.