సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వెంటనే మంచి అవకాశం దొరకడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలోనే ఓ స్టార్ డైరెక్టర్ దగ్గర పనిచేసే ఛాన్స్ వస్తే చాలామంది దాన్ని వదులుకోవడానికి అస్సలు ఇష్టపడరు. అలాంటిది అప్పట్లో నెలకు రూ.50 వేల జీతంతో దేశంలోని ఓ టాప్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే అవకాశం వచ్చినా.. యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మాత్రం ఆ ఆఫర్‌ను తిరస్కరించారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన ఈ విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

నెలకు రూ.50 వేల జీతంతో ఆఫర్

ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్‌తో జరిగిన చిట్‌చాట్‌లో శ్రీకాంత్ ఓదెల తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన ఓ ఆసక్తికరమైన అనుభవాన్ని పంచుకున్నారు. ఓ ప్రముఖ దర్శకుడి దగ్గర అనూహ్యంగా పనిచేసే అవకాశం తనకు వచ్చిందని చెప్పారు. “ఆయన పేరు చెప్పను. ఇండియన్ సినిమాలో టాప్ డైరెక్టర్లలో ఒకరు. ఓ రోజు అనుకోకుండా ఆయన నుంచి నాకు పిలుపు వచ్చింది. మరుసటి రోజు నుంచే షూటింగ్‌కు రావాలని, నెలకు రూ.50 వేల జీతం ఇస్తానని చెప్పారు” అని శ్రీకాంత్ గుర్తుచేసుకున్నారు.

ఆ రోజుల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌కు రూ.50 వేల జీతం అంటే చాలా పెద్ద మొత్తమే. అంతేకాదు, అంతటి పేరున్న దర్శకుడితో కలిసి పనిచేసే అవకాశం కూడా అరుదైనదే. అయినప్పటికీ శ్రీకాంత్ ఆ ఆఫర్‌ను అంగీకరించలేదు.

సుకుమార్ దగ్గరే సినిమా నేర్చుకోవాలని..

తన నిర్ణయానికి కారణం కూడా శ్రీకాంత్ స్పష్టంగా చెప్పారు. “సార్.. నన్ను క్షమించండి. సుకుమార్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి సినిమా నేర్చుకోవాలనేది నా లక్ష్యం. అక్కడ నేర్చుకున్న తర్వాతే ఎక్కడైనా పనిచేస్తాను. ఇప్పుడైతే ఈ ఆఫర్‌ను తీసుకోలేను” అని ఆ దర్శకుడితో చెప్పినట్లు వెల్లడించారు.

అంత మంచి అవకాశం, మంచి జీతం వచ్చినా తన లక్ష్యాన్ని మార్చుకోకుండా శ్రీకాంత్ తీసుకున్న నిర్ణయం అప్పట్లో పెద్ద రిస్క్‌గానే అనిపించి ఉండొచ్చు. కానీ అదే పట్టుదల తర్వాత ఆయన కెరీర్‌కు బలమైన పునాది వేసింది.

‘నాన్నకు ప్రేమతో’తో కెరీర్‌కు తొలి అడుగు

సుకుమార్ టీమ్‌లో చేరడం కూడా శ్రీకాంత్‌కు అంత సులభంగా జరగలేదట. తన షార్ట్‌ఫిల్మ్స్‌ను చూపిస్తూ ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత చివరకు సుకుమార్ దగ్గర పనిచేసే అవకాశం దక్కించుకున్నారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు.

ఆ తర్వాత తనకంటూ ప్రత్యేకమైన కథనం, మేకింగ్ స్టైల్‌ను ఏర్పరుచుకున్న శ్రీకాంత్ ఓదెల.. ‘దసరా’తో టాలీవుడ్‌లో తన సత్తా చాటారు. నాని హీరోగా తెరకెక్కిన ఈ రా అండ్ రస్టిక్ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం నాని హీరోగా ‘ది ప్యారడైజ్’ సినిమాను తెరకెక్కిస్తూ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ యంగ్ డైరెక్టర్లలో ఒకరిగా మారారు. కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఆ భారీ ఆఫర్‌ను కాదనుకుని సుకుమార్‌ను ఎంచుకున్న నిర్ణయం ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల కెరీర్‌ను చూస్తే ఎంత కీలకమో అర్థమవుతోంది.