
D Spiritual: Nov 21: బొప్పూడి ఆలయాల ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ దంపతులు
బొప్పూడి: చిలకలూరిపేట మండలం బొప్పూడిలో శుక్రవారం పురాతన ఆలయాల పునఃప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ స్వగ్రామమైన బొప్పూడిలో దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రూ.2.30 కోట్ల వ్యయంతో ఒకే ప్రాంగణంలో చెన్నకేశవస్వామి, మల్లీశ్వరస్వామి ఆలయాలను పునర్నిర్మించారు. ఈ ఆలయాల ప్రతిష్ఠ మహోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో రెండు ధ్వజస్తంభాల ప్రతిష్ఠ, ప్రత్యేక హోమాలు, ఇతర వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చెన్నకేశవస్వామి, మల్లీశ్వరస్వామి వార్ల కల్యాణ మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఈ వేడుకలను తిలకించేందుకు బొప్పూడితో పాటు పరిసర గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు.
1098లో ఆలయాల ప్రతిష్ఠ.. 1768లో తొలి జీర్ణోద్ధరణ
ఈ సందర్భంగా జస్టిస్ బి.కృష్ణమోహన్ మాట్లాడుతూ బొప్పూడిలోని చెన్నకేశవస్వామి, మల్లీశ్వరస్వామి ఆలయాలు ఎంతో పురాతనమైనవని తెలిపారు. చరిత్ర ప్రకారం ఈ ఆలయాలను 1098లో ప్రతిష్ఠించినట్లు పేర్కొన్నారు. అనంతరం 1768లో తమ వంశీకుడైన బొప్పూడి రాజన్న ఈ ఆలయాలకు తొలి జీర్ణోద్ధరణ కార్యక్రమాలు చేపట్టారని వివరించారు.
ప్రస్తుతం రెండోసారి ఆలయాల జీర్ణోద్ధరణ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం భగవంతుడు తమకు కల్పించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. పురాతన ఆలయాల వైభవాన్ని పునరుద్ధరించడం, భవిష్యత్ తరాలకు ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించడం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు.
పలువురు ప్రముఖుల హాజరు
ఈ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయికల్యాణ చక్రవర్తి, దేవాదాయశాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్, అటవీశాఖ అధికారులు మల్లికార్జునరావు, రామచంద్రయ్య, దేవాదాయశాఖ చీఫ్ ఇంజినీర్ జీవీఆర్ శేఖర్, స్థపతి పరమేశ్వరప్ప, గజల్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
వీరితో పాటు ప్రస్తుత, విశ్రాంత రవాణాశాఖ అధికారులు రమాశ్రీ, ప్రసాదరావు, చిలకలూరిపేట పురపాలక ఛైర్పర్సన్గా ఎన్నికైన తోట రాజరాజేశ్వరి, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భక్తుల రాకతో బొప్పూడిలో పండుగ వాతావరణం నెలకొంది.
