
ఆంధ్రప్రదేశ్లో మురసు తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. రాష్ట్రంలో తుఫాన్ పరిస్థితులు జరిగిన నష్టం ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యల గురించి ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్నారు.
అర్నబ్ తుఫాన్ ప్రభావం నుంచి రాష్ట్రం కోలుకుంటున్న సమయంలోనే మురసు తుఫాన్ విరుచుకుపడటంతో ఎదురైన పరిస్థితులను చంద్రబాబు కేంద్ర హోంమంత్రికి వివరించారు. వివిధ జిల్లాల్లో జరిగిన పంట నష్టం ఆస్తి నష్టం వివరాలను వెల్లడించారు. తుఫాన్ నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపించినందుకు అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు.
వరుస తుఫాన్ల కారణంగా రాష్ట్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తగిన ఆర్థిక ఇతర సహాయ సహకారాలు అందించి ఆదుకోవాలని చంద్రబాబు కోరారు.
మరోవైపు మురసు తుఫాన్ ఒంగోలుకు దక్షిణంగా తీరం దాటడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురుగాలులతో పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో అక్కడ నివసిస్తున్న ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పునరావాస సహాయక చర్యలను అధికారులు కొనసాగిస్తున్నారు.
