D Spiritual: Nov 19: పుట్టపర్తి: వేద మంత్రోచ్చారణలు, సంప్రదాయ నృత్యాలు, భక్తుల నీరాజనాలు, సాయినామస్మరణలతో పుట్టపర్తిలో శ్రీసత్యసాయి రథోత్సవం అత్యంత వైభవంగా సాగింది. ఎటు చూసినా భక్తి పారవశ్యం కనిపించగా, ఓం సాయిరాం నామస్మరణతో ప్రశాంతి నిలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

శ్రీసత్యసాయి 101వ జయంత్యుత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం నిర్వహించిన రథోత్సవం భక్తజనుల కీర్తనలు, విద్యార్థుల వేదపఠనం, బ్యాండు మేళాల నడుమ కన్నుల పండువగా జరిగింది. వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం శ్రీసత్యసాయి, వేణుగోపాల స్వామి, సీతారాములు, హనుమంతుడి ఉత్సవ విగ్రహాలను విద్యార్థుల వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల మధ్య గోపుర ద్వారం వద్దకు తీసుకువచ్చారు.

ప్రత్యేకంగా అలంకరించిన బంగారు శ్రీసత్యసాయి విగ్రహాన్ని వెండి రథంపై ప్రతిష్ఠించి ఉదయం 9.45 గంటలకు రథోత్సవాన్ని ప్రారంభించారు. రథం ముందుకు సాగుతుండగా భక్తులు పూలవర్షం కురిపిస్తూ, కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు చెల్లించుకున్నారు. సాయినామస్మరణతో పురవీధులన్నీ మార్మోగాయి.

అంతకుముందు విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ సామూహిక శ్రీసత్యసాయి సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా బాలవికాస్ విద్యార్థులు, భక్తులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక సందేశాన్ని చాటిచెప్పాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సత్యసాయి భక్తులు, బాలవికాస్ విద్యార్థులు పట్టణ పురవీధుల్లో ప్రదర్శించిన భక్తిపూర్వక నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేదఘోషలు, భజనలు, సంప్రదాయ కళారూపాల నడుమ సాగిన రథోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *