అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ముఖ్య అధికారి అనిల్‌ పునేఠా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించినట్లు వెల్లడించారు.

అన్ని జిల్లాల్లో పోలింగ్‌ సరళిపై సమీక్ష నిర్వహించామని, వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించినట్లు తెలిపారు. జిల్లా పరిశీలకులతో ఎప్పటికప్పుడు మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నామన్నారు. కొన్ని జిల్లాల నుంచి చిన్నచిన్న ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఎప్పుడూ తటస్థంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.

కలెక్టర్లు సమర్పించే నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అనిల్‌ పునేఠా తెలిపారు. పులివెందుల ఘటనపై నివేదిక అందిన తర్వాత పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సరైన ఆధారాలు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోలేమని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, విజయవాడ 55వ డివిజన్‌లో సాంకేతిక సమస్యల కారణంగా పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేందుకు అధికారులు పోలింగ్‌ సమయాన్ని పొడిగించారు.

By Ramya