
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యకలాపాలపై మంత్రి సీతక్క ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ సేవలను గ్రామీణ స్థాయి నుంచి మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. ఈ దిశగా అంగన్వాడీ టీచర్ల అభిప్రాయాలు, సూచనలు నేరుగా తెలుసుకునేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక సదుపాయాల లోపాలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని సూచించారు. టీచర్లు, ఆయాలకు అందించనున్న కొత్త యూనిఫామ్ల నమూనాలను పరిశీలించి, అక్టోబర్ తొలి వారంలోగా పంపిణీకి సిద్ధం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం పనిచేస్తున్న 17 శిశు దత్తత కేంద్రాల సంఖ్యను పెంచి, ప్రతి జిల్లాలో కనీసం ఒక అడాప్షన్ సెంటర్ ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి ఆదేశించారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 16 జిల్లాల్లో నోటిఫికేషన్లు జారీ చేశామని అధికారులు వెల్లడించగా, మిగిలిన జిల్లాల్లోనూ కలెక్టర్లతో సమన్వయం చేసి నియామకాలను వేగవంతం చేయాలని సీతక్క సూచించారు.
అదే విధంగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం నాణ్యత, వారి ఆరోగ్య పురోగతిపై నమూనా సర్వే నిర్వహించి సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే సంక్షేమ నిధులు ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగం కాకుండా మిగిలిపోకుండా, పూర్తి స్థాయిలో ఖర్చు చేసేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

