
మురసు తీవ్ర తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. రాయలసీమ జిల్లాల్లో నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము మధ్య ఒంగోలు సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశముందని అధికారులు మంత్రికి వివరించారు.
ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల కలెక్టర్లు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అనిత ఆదేశించారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్ లైన్లపై పడే అవకాశం ఉన్న చెట్లను ముందుగానే తొలగించాలని విద్యుత్, నెట్వర్క్ అంతరాయాలను తక్షణమే పరిష్కరించేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.
మత్స్యకారులు తమ బోట్లు వలలను సురక్షిత ప్రాంతాల్లో ఉంచుకునేలా ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలన్నారు. రాబోయే 48 గంటల పాటు అధికార యంత్రాంగం హైఅలర్ట్‌లో ఉండాలని ఆదేశించారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.
గాలుల కారణంగా తెగిపడే విద్యుత్ తీగల పట్ల ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా ప్రమాదం జరిగే సూచనలు కనిపించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీజీఎస్, విపత్తుల నిర్వహణ సంస్థ సమన్వయంతో తుఫాన్ కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని అనిత వెల్లడించారు.
అధికారిక హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని వదంతులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. తుఫాన్ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ హెల్ప్‌లైన్ నంబర్లు 112, 1070, 18004250101ను సంప్రదించాలని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.
