వయస్సు 40 ఏండ్లకు పైబడిన వారు తప్పనిసరిగా కొన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. నలభై ఏళ్ల తర్వాత శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అందుకే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యల ను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చికిత్స పొందే అవకాశం ఉంటుంది. దాంతో ఆరోగ్యంగా జీవించగలుగుతాం.

బ్లడ్‌ షుగర్‌ పరీక్ష

మధుమేహం ఒకప్పుడు వయసు పైబడిన వారిలో ఎక్కువగా కనిపించేది. ప్రస్తుతం మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న వయసులోనే మధుమేహం బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. 40 ఏళ్లు దాటిన వారు వైద్యుల సలహాతో క్రమం తప్పకుండా రక్తంలో చక్కెర స్థాయులను పరీక్షించుకోవడం మంచిది.

కొలెస్ట్రాల్‌ పరీక్ష

అధిక కొవ్వు, ప్రాసెస్‌డ్‌ ఫుడ్స్‌, ఇన్‌స్టంట్‌ ఫుడ్స్‌ వంటి ఆహారపు అలవాట్లు అధిక బరువు, రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరగడానికి కారణమవుతాయి. కొలెస్ట్రాల్‌ అధికంగా ఉండటం గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే 40 ఏళ్లు దాటిన వారు వైద్యుల సూచన మేరకు లిపిడ్‌ ప్రొఫైల్‌ వంటి పరీక్షలు చేయించుకోవడం ఉపయోగకరం.

బీపీ పరీక్ష

ప్రస్తుత జీవనశైలిలో మానసిక ఒత్తిడి, సరైన విశ్రాంతి లేకపోవడం, ఆహారపు అలవాట్లు రక్తపోటు పెరగడానికి కారణమవుతున్నాయి. అధిక రక్తపోటు చాలా సందర్భాల్లో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకుండానే ఉండొచ్చు. అందువల్ల 40 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా బీపీని చెక్‌ చేసుకోవడం మంచిది.

థైరాయిడ్‌ పరీక్ష

థైరాయిడ్‌ గ్రంథి పనితీరులో మార్పులు హైపోథైరాయిడిజం, హైపర్‌థైరాయిడిజం వంటి సమస్యలకు దారితీయవచ్చు. అలసట, బరువులో మార్పులు, గుండె వేగం పెరగడం వంటి వివిధ లక్షణాలు కనిపించవచ్చు. అవసరాన్ని బట్టి వైద్యులు సూచించే థైరాయిడ్‌ ఫంక్షన్‌ పరీక్షలు చేయించుకోవచ్చు.

విటమిన్‌, మినరల్‌ పరీక్షలు

శరీరం సక్రమంగా పనిచేయడానికి వివిధ విటమిన్లు, ఖనిజాలు అవసరం. వీటిలో లోపాలు ఉంటే అలసట, బలహీనత తదితర సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ప్రతి ఒక్కరికీ అన్ని విటమిన్ల పరీక్షలు తప్పనిసరి కాదు. లక్షణాలు, ఆరోగ్య పరిస్థితి ఆధారంగా వైద్యులు సూచించిన పరీక్షలు చేయించుకోవడం మంచిది.

గుండె ఆరోగ్య పరీక్షలు

మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ వంటి సమస్యలు దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు, అధిక బరువు లేదా ఇతర ప్రమాద కారకాలు ఉన్నవారు వైద్యుల సలహాతో తగిన గుండె పరీక్షలు చేయించుకోవాలి.

పరీక్షలతో పాటు జీవనశైలిలో మార్పులు

ఆరోగ్య పరీక్షల్లో ఏదైనా సమస్య గుర్తిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకోవాలి. అదే సమయంలో పరీక్షల్లో ఎలాంటి సమస్యలు కనిపించలేదని ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకూడదు.

By Ramya