బరువు తగ్గాలని చాలామంది డైట్‌ పేరుతో ఆహారాన్ని పూర్తిగా తగ్గించుకోవడం లేదా వింతైన డైట్లను అనుసరించడం చేస్తున్నారు. స్లీపింగ్‌ బ్యూటీ డైట్‌, బేబీ ఫుడ్‌ డైట్‌, ఐస్‌ డైట్‌, సిర్ట్‌ఫుడ్‌ డైట్‌, హోల్‌30 డైట్‌ వంటి వాటి తర్వాత ఇప్పుడు వాల్యూమెట్రిక్స్‌ డైట్‌ కూడా బరువు తగ్గించే విధానంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

ఈ డైట్‌ విధానాన్ని పోషకాహార నిపుణురాలు బార్బరా రోల్స్‌ అభివృద్ధి చేశారు. ఇందులో ఏ ఆహారాన్నీ పూర్తిగా నిషేధించరు. అయితే రోజువారీ కేలరీల పరిమితిని దృష్టిలో ఉంచుకుని ఆహారాన్ని ఎంచుకోవాలని సూచిస్తారు. అంటే ఇష్టమైన ఆహారాలను పూర్తిగా దూరం పెట్టడం కంటే.. తక్కువ కేలరీలు ఉండే ఆహారాలతో కడుపు నిండేలా చూసుకోవడమే ఈ విధానం ప్రధాన ఉద్దేశం.

నాలుగు గ్రూపులుగా ఆహారాల విభజన

వాల్యూమెట్రిక్స్‌ డైట్‌లో ఆహారాలను ప్రధానంగా నాలుగు గ్రూపులుగా విభజించారు.

మొదటి గ్రూప్‌: పిండి పదార్థాలు తక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు, కొవ్వు లేని పాలు, బ్రోత్‌ ఆధారిత సూప్‌లు ఇందులో ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవచ్చు.

రెండో గ్రూప్‌: పిండి పదార్థాలు ఉండే పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, బ్రేక్‌ఫాస్ట్‌ సీరియల్స్‌, తక్కువ కొవ్వు మాంసం, పప్పుధాన్యాలు వంటి ఆహారాలు ఇందులోకి వస్తాయి. వీటినీ ఆహారంలో భాగంగా ఎక్కువగా చేర్చుకోవచ్చు.

మూడో గ్రూప్‌: మాంసం, చీజ్‌, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, సలాడ్‌ డ్రెస్సింగ్‌, బ్రెడ్‌, ఐస్‌క్రీమ్‌, కేక్‌ వంటి ఆహారాలు ఈ విభాగంలో ఉంటాయి. వీటిని పరిమిత పరిమాణంలో తీసుకోవాలని సూచిస్తారు.

నాలుగో గ్రూప్‌: చిప్స్‌, చాక్లెట్‌ క్యాండీలు, కుకీలు, నట్స్‌, వెన్న, నూనె వంటి అధిక కేలరీల ఆహారాలు ఇందులో ఉంటాయి. వీటిని వీలైనంత వరకు తగ్గించుకోవాలి.

మొత్తంగా చూస్తే.. మొదటి, రెండో గ్రూపులకు చెందిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం, మూడో గ్రూప్‌ ఆహారాలను పరిమితంగా తీసుకోవడం, నాలుగో గ్రూప్‌ ఆహారాలను సాధ్యమైనంత వరకు తగ్గించడం ఈ డైట్‌ ముఖ్య ఉద్దేశం.

తక్కువ కేలరీలు ఉన్న ఆహారాలను ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం ద్వారా కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి, ఆకలిని నియంత్రించుకోవచ్చని ఈ విధానం సూచిస్తోంది. తద్వారా రోజువారీ కేలరీల తీసుకోవడం తగ్గి బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ఇదే విషయాన్ని పరిశీలించేందుకు నిర్వహించిన ఒక అధ్యయనంలో 97 మంది ఊబకాయం ఉన్న మహిళలను రెండు గ్రూపులుగా విభజించి పరిశీలించారు. ఈ అధ్యయనంలో వాల్యూమెట్రిక్స్‌ డైట్‌ బరువు తగ్గడంపై చూపిన ప్రభావాన్ని పరిశోధకులు విశ్లేషించారు.

By Ramya