ఆహారం మన శరీరానికి ఇంధనం లాంటిది. అయితే మనం తీసుకునే ఆహారం శరీరానికి అవసరమైన శక్తిగా ఎలా మారుతుంది? ఇందులో విటమిన్ బి6 కీలక పాత్ర పోషిస్తుంది. ఇది నీటిలో కరిగే పోషకం. ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియలో సహాయపడటంతోపాటు మెదడు, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి కూడా ఇది అవసరం.

గుండె ఆరోగ్యానికి..

విటమిన్ బి6 గుండె ఆరోగ్యానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకున్నప్పుడు రక్తంలో హోమోసిస్టీన్‌ అనే అమైనో ఆమ్లం ఏర్పడుతుంది. ఇది అధికంగా ఉంటే వాపు, గుండె సంబంధిత సమస్యల ప్రమాదం పెరుగుతుంది. రక్తంలోని హోమోసిస్టీన్‌ స్థాయిలను నియంత్రించడంలో విటమిన్ బి6 సహాయపడుతుంది. ఫోలేట్‌తో కలిసి తీసుకున్నప్పుడు హోమోసిస్టీన్‌ స్థాయిలను తగ్గించడంలో, భవిష్యత్తులో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్‌ స్థాయిలను నిర్వహించడంలో కూడా ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. మెదడు పనితీరుకు కూడా విటమిన్ బి6 అవసరం.

మాన‌సిక స్థితికి..

మన మానసిక స్థితిపై కూడా విటమిన్ బి6 ప్రభావం చూపిస్తుంది. మెదడులో సెరొటోనిన్‌, నోర్‌ఎపినెఫ్రిన్‌ వంటి మూడ్‌కు సంబంధించిన హార్మోన్ల ఉత్పత్తిలో ఇది సహాయపడుతుంది. వీటి ఉత్పత్తి సక్రమంగా ఉండటం వల్ల మానసిక స్థితి మెరుగుపడటానికి తోడ్పడుతాయి. విటమిన్ బి6 తగినంతగా లభించడం డిప్రెషన్‌, ఆందోళన వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. రక్తహీనతను నివారించడంలోనూ విటమిన్‌ బి6 పాత్ర ఉంటుంది. రక్తంలోని హిమోగ్లోబిన్‌ శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్‌ను చేరవేస్తుంది. హిమోగ్లోబిన్‌ తయారీలో విటమిన్ బి6 అవసరం. హిమోగ్లోబిన్‌ లోపం వల్ల రక్తహీనత ఏర్పడి అలసట, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ర‌క్త‌పోటు స‌మ‌స్య‌కు..

రక్తపోటు ఉన్నవారికి కూడా విటమిన్ బి6 ఉపయోగపడే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీని వినియోగం పెరగడం వల్ల హైబీపీ ఉన్నవారిలో రక్తపోటు తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ధమనుల్లో కొవ్వు లేదా ప్లాక్‌ పేరుకుపోకుండా నిరోధించడంలో ఇది సహాయపడుతుంది. తద్వారా గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మహిళల్లో నెలసరి ముందు కనిపించే పీఎంఎస్ లక్షణాలను తగ్గించడంలో కూడా విటమిన్ బి6 ఉపయోగపడుతుంది.

By Ramya