
కళ్యాణదుర్గం: శెట్టూరు మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి హర్షవర్ధన్ గోడ కూలిన ఘటనలో మృతి చెందడం విషాదాన్ని నింపింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు వెంటనే ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం నుంచి తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఘటనపై వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు.
ఎమ్మెల్యే చొరవతో త్వరితగతిన స్పందించిన అధికారులు ఉదయానికే విద్యార్థి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం మంజూరు చేశారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఆర్డీవో వసంత్బాబుతో కలిసి ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులకు పరిహారం చెక్కును అందజేశారు. ప్రభుత్వం తరఫున అందించిన సహాయాన్ని అందిస్తూ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హర్షవర్ధన్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పాత భవనాలు, శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రమాదకరంగా ఉన్న వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.
విద్యార్థుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, హర్షవర్ధన్ కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

