మొక్కజొన్న అందరికీ మంచిదేనా?
వేడివేడి బొగ్గులపై కాల్చి, నిమ్మరసం, కారం అద్దిన మొక్కజొన్న పొత్తును తింటే ఆ రుచే వేరు. రుచికరంగా ఉండటంతో పాటు శరీరానికి అవసరమైన పలు పోషకాలను అందించే మొక్కజొన్నను చాలామంది ఇష్టంగా తింటారు. అయితే మొక్కజొన్న అందరి ఆరోగ్యానికి ఒకే విధంగా మేలు చేయకపోవచ్చు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని అధికంగా తీసుకుంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

మొక్కజొన్నలో ఫైబర్‌తో పాటు విటమిన్ బి1, బి6, విటమిన్ ఇ, ఫోలిక్ యాసిడ్, నియాసిన్, రిబోఫ్లేవిన్ వంటి పలు ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడంతో పాటు రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో సహాయపడతాయి. అలాగే ఇందులోని యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మేలు చేయవచ్చని భావిస్తారు. పుష్కలంగా ఉండే పీచు పదార్థం జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి తోడ్పడుతుంది.
మొక్కజొన్న అందరికీ సరిపోదు
మొక్కజొన్నలో ఎన్నో పోషకాలు ఉన్నప్పటికీ.. ఇది ప్రతి ఒక్కరి శరీర తత్వానికి సరిపడకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని మెడికవర్ హాస్పిటల్ సీనియర్ డైటీషియన్ స్వాతి తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మొక్కజొన్నను అధికంగా తీసుకుంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఆరోగ్య పరిస్థితిని బట్టి మొక్కజొన్నను పరిమితంగా తీసుకోవడం మంచిది.
ముఖ్యంగా తరచూ చర్మ సమస్యలు, దద్దుర్లు, అలర్జీలతో బాధపడేవారు మొక్కజొన్నను దూరం పెట్టడం లేదా మితంగా తీసుకోవడం మంచిది. ఇందులోని కొన్ని ప్రొటీన్లు చర్మ ప్రతిచర్యలను పెంచి సమస్యను తీవ్రతరం చేస్తాయి. అలాగే ఇందులో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం వల్ల షుగర్ ఉన్నవారు ఒకేసారి ఎక్కువ పరిమాణంలో తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగే ప్రమాదం ఉంది.
జీర్ణ సమస్యలు, గ్యాస్, ఎసిడిటీ ఉన్నవారు దీనిని ఎక్కువగా తింటే కడుపు ఉబ్బరం, అజీర్ణం పెరుగుతాయి. మరోవైపు బరువు తగ్గాలనుకునేవారు నూనె, వెన్న, అధిక ఉప్పు లేకుండా ఉడకబెట్టిన రూపంలో మాత్రమే తీసుకోవాలి. పచ్చిగా లేదా సగం ఉడికిన మొక్కజొన్నను ఎట్టిపరిస్థితుల్లోనూ తినకూడదని, ఇది కడుపునొప్పి, ప్రేగుల్లో ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని డైటీషియన్ స్వాతి హెచ్చరిస్తున్నారు.

