
D Spiritual: Nov 18: తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ కీలక సమాచారం అందించింది. బుధవారం (నవంబర్ 18) గురువారం దర్శనాల కోసం జారీ చేయాల్సిన సర్వదర్శనం (SSD) టోకెన్లను రద్దు చేసింది. దీంతో గురువారం శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులు నేరుగా తిరుమలకు చేరుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా సర్వదర్శనం చేసుకోవచ్చు.
శుక్రవారం దర్శనానికి గురువారం నుంచి టోకెన్లు
సాధారణంగా తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లలో టీటీడీ సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తుంది. అయితే గురువారం దర్శనాల కోసం బుధవారం టోకెన్ల జారీని నిలిపివేసింది. మంగళవారం జారీ చేసిన టోకెన్లు, శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వచ్చే భక్తులకు ఇచ్చిన టోకెన్లు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. శుక్రవారం దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు గురువారం నుంచి మూడు కేంద్రాల్లో SSD టోకెన్లు జారీ చేయనున్నారు. భక్తులు టోకెన్ల జారీ సమయాలను గమనించి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
పద్మావతి అమ్మవారికి బంగారు డాలర్ విరాళం
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చెన్నైకి చెందిన భక్తుడు కేపీ రాఘవన్ బంగారు డాలర్‌ను విరాళంగా అందించారు. 0.64 గ్రాముల బరువున్న ఈ డాలర్ విలువ సుమారు రూ.10 లక్షలుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
కపిలేశ్వరాలయంలో కాలభైరవ హోమం
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాస హోమ మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ కాలభైరవ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అష్టభైరవ హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం వంటి కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం కాలభైరవ స్వామివారికి కలశాభిషేకం, నివేదన, హారతి సమర్పించారు.
నవంబర్ 18 నుంచి చండీయాగం
కార్తీక మాస హోమ మహోత్సవాల్లో భాగంగా నవంబర్ 18 నుంచి 26వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి పేరిట చండీయాగం నిర్వహించనున్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆలయ అధికారులు, అర్చకులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు.
