బీటెక్ తర్వాత క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా ఐటీ ఉద్యోగంలో చేరిన విక్రమ్‌దేవ్ మహాపాత్ర.. దాదాపు 14 ఏళ్ల పాటు పలు ప్రముఖ కంపెనీల్లో పనిచేశారు. మంచి జీతం ఉన్న ఉద్యోగాన్ని వదిలి సొంతూరైన ఒడిశాలోని నవరంగ్‌పూర్‌కు తిరిగి వచ్చి పుట్టగొడుగుల సాగు ప్రారంభించారు. ఇప్పుడు నెలకు రూ.16-19 లక్షల ఆదాయం పొందుతూ.. 20 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నారు.

ఐటీ నుంచి వ్యవసాయం వైపు..

2012లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో బీటెక్ పూర్తి చేసిన విక్రమ్‌దేవ్.. డిస్కవర్‌చర్ సొల్యూషన్స్, మైండ్‌ట్రీ, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ వంటి ఐటీ సంస్థల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, టెక్నికల్ లీడ్ తదితర హోదాల్లో పనిచేశారు. 14 ఏళ్ల కార్పొరేట్ కెరీర్ తర్వాత ఉద్యోగాన్ని వదిలి సొంతూరికి చేరుకున్నారు.

రోజుకు 500-600 కిలోల ఉత్పత్తి..

‘గంగా భూమి మష్రూమ్స్’ పేరుతో కమర్షియల్ ఫామ్, ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రోజుకు 500-600 కిలోలు, నెలకు 15-18 టన్నుల పుట్టగొడుగులను ఉత్పత్తి చేస్తున్నారు. కిలో రూ.100-110 వరకు విక్రయిస్తూ నెలకు సగటున రూ.16-19 లక్షల ఆదాయం పొందుతున్నారు.

బ్రహ్మపూర్, భువనేశ్వర్ మార్కెట్లకు సరఫరా చేస్తుండగా.. ఫామ్‌లో స్థానికంగా 24 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఐటీ ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయంలో అడుగుపెట్టి విజయవంతమైన వ్యాపారాన్ని నిర్మించుకున్న విక్రమ్‌దేవ్ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

By Ramya