రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. గోదావరిలోకి దూకే ముందు నూకరాజు తన సూసైడ్ లెటర్‌ను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసినట్లు సమాచారం.

నూకరాజు (60), ఆయన భార్య మీనా (59), కుమార్తె సౌజన్య (34) గోదావరిలో గల్లంతయ్యారు. అయితే నూకరాజు మనవడిని స్థానిక మత్స్యకారులు రక్షించారు. రిటైర్మెంట్‌కు సమీపంలో ఉన్న నూకరాజు కుటుంబంతో కలిసి ఈ నిర్ణయం తీసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

పవన్ కల్యాణ్ స్పందన

ఈ ఘటనపై పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాల సేవలను వినియోగించాలని సూచించారు.

ఈ మేరకు తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల ఎస్పీలతో పవన్ కల్యాణ్ ఫోన్‌లో మాట్లాడి సహాయక చర్యలపై ఆరా తీశారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

By Ramya