ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గోల్గప్పాలు కొనిస్తానని నమ్మించి ఇంటి నుంచి తీసుకెళ్లిన ఎనిమిదేళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడి, అనంతరం హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నవంబర్ 6వ తేదీ శుక్రవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాలిక మృతదేహాన్ని నవంబర్ 7వ తేదీ శనివారం తెల్లవారుజామున పోలీసులు గుర్తించారు.

గోల్గప్పాలు కొనిస్తానని నమ్మించి..
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాలిక కుటుంబానికి పరిచయమున్న రవి కశ్యప్ అనే వ్యక్తి ఆమెను గోల్గప్పాలు కొనిస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఇంటికి సుమారు 500 మీటర్ల దూరంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
అక్కడ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు, ఇనుప రాడ్‌తో తలపై దాడి చేసి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని వార్తా కథనాలు పేర్కొన్నాయి. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు.
అర్ధరాత్రి సమయంలో మృతదేహం గుర్తింపు
శుక్రవారం మధ్యాహ్నం బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
శనివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఇంటికి సమీపంలోని ఖాళీ స్థలంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. ఆమె తలపై గాయాల గుర్తులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
బాలిక తండ్రితో ఒకే ఫ్యాక్టరీలో నిందితుడు
ఈ ఘటన బులంద్‌షహర్‌లోని ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిందితుడు రవి కశ్యప్ బాలిక తండ్రి పనిచేస్తున్న ఫ్యాక్టరీలోనే ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇరు కుటుంబాలు ఒకే భవనంలో వేర్వేరు అద్దె ఇళ్లలో నివసిస్తున్నట్లు తెలిపారు.
నిందితుడు కన్నౌజ్ జిల్లాలోని చిబ్రామౌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న తరియన్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. బాలిక కుటుంబం స్వస్థలం బదాయూన్ జిల్లా. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు బాలిక మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు.
నిందితుడి కోసం పోలీసుల గాలింపు
ఈ ఘటనపై సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103(1) కింద హత్య, సెక్షన్ 238 కింద సాక్ష్యాలను మాయం చేయడానికి సంబంధించిన కేసు నమోదు చేసినట్లు అదనపు ఎస్పీ అభిషేక్ ప్రతాప్ అజయ్ తెలిపారు.
నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. నిందితుడి భార్యను కూడా పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, నేరం జరిగిన క్రమాన్ని నిర్ధారించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
