
కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో కలిసి రైలులో ప్రయాణించాలనుకునే వారికి భారతీయ రైల్వే కీలక వెసులుబాటు కల్పించింది. పెళ్లిళ్లు, తీర్థయాత్రలు, విద్యా విహారయాత్రలు, క్రీడా పోటీలు వంటి కార్యక్రమాల కోసం పెద్ద సంఖ్యలో ప్రయాణించే వారికి ఉపయోగపడేలా దక్షిణ పశ్చిమ రైల్వే (SWR) గ్రూప్, బల్క్ టికెట్ బుకింగ్ నిబంధనల్లో మార్పులు చేసింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న ప్రయాణికుల సంఖ్య, బెర్తులకు సంబంధించిన గరిష్ఠ పరిమితులను తొలగిస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
అన్ని తరగతుల రిజర్వేషన్లకు వర్తింపు
కొత్త నిబంధనల ప్రకారం పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఒకేసారి టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ సదుపాయం అన్ని తరగతుల రిజర్వేషన్లకు వర్తిస్తుంది. కన్ఫర్మ్ టికెట్లతో పాటు RAC, వెయిటింగ్ లిస్ట్ టికెట్ల బుకింగ్కూ ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి.
అయితే గరిష్ఠ పరిమితులను తొలగించినంత మాత్రాన అందరికీ కన్ఫర్మ్ బెర్తులు లభిస్తాయని భావించకూడదు. రైలులో అందుబాటులో ఉన్న సీట్లు, బెర్తులు, రిజర్వేషన్ నిబంధనల ఆధారంగానే టికెట్ల కేటాయింపు జరుగుతుంది.
ఉదయం 9 గంటల నుంచి గ్రూప్ బుకింగ్
సాధారణ రిజర్వేషన్లు అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ARP) ప్రకారం ప్రయాణ తేదీకి 60 రోజుల ముందు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతాయి. అయితే గ్రూప్, బల్క్ రిజర్వేషన్ల కోసం ఉదయం 9 గంటల నుంచి సంబంధిత రైల్వే అధికారులను సంప్రదించాలి. ఈ సదుపాయం ప్రధాన రైల్వే స్టేషన్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఉదాహరణకు.. 60 రోజుల తర్వాత ప్రయాణించాలనుకునే వారు సాధారణ టికెట్లను ఉదయం 8 గంటల నుంచి బుక్ చేసుకోవచ్చు. అదే గ్రూప్ రిజర్వేషన్ కోసం ఉదయం 9 గంటల నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అనుమతుల బాధ్యత ఈ అధికారులకు
బల్క్ రిజర్వేషన్లకు అనుమతులు ఇచ్చే అధికారాలను చీఫ్ రిజర్వేషన్ సూపర్వైజర్ (CRS), స్టేషన్ మేనేజర్ (SM)లకు అప్పగించారు. గతంలో ఉన్న అధికార పరిధి, పరిమితుల్లో మార్పులు చేసి.. సంబంధిత అధికారులు బుకింగ్లను పరిశీలించి అనుమతులు ఇచ్చేలా కొత్త విధానాన్ని రూపొందించారు.
ఎవరెవరు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు?
నిజమైన అవసరాలతో బృందాలుగా ప్రయాణించే వారికి ఈ వెసులుబాటు అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా:
- పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు వెళ్లే కుటుంబాలు, బంధువులు
- పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల విద్యా పర్యటనలు
- తీర్థయాత్రలకు వెళ్లే భక్తుల బృందాలు
- క్రీడా పోటీల్లో పాల్గొనే జట్లు
- సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్లే బృందాలు
- ఇతర సామూహిక ప్రయాణాలు చేసే గ్రూపులు
ప్రయాణికుల వివరాలు తప్పనిసరి
బల్క్ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ప్రయాణ ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేయాలి. అలాగే గ్రూపులోని ప్రతి ప్రయాణికుడి పూర్తి పేరు, వయస్సు, లింగం, చిరునామా వంటి వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ సమాచారాన్ని పరిశీలించిన తర్వాత రైల్వే అధికారులు నిబంధనల ప్రకారం అనుమతులు మంజూరు చేస్తారు.
ట్రావెల్ ఏజెంట్లను సంప్రదించాల్సిన అవసరం లేదు
పెద్ద సంఖ్యలో టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే వారు ట్రావెల్ ఏజెంట్లకు బదులుగా నేరుగా సంబంధిత రైల్వే అధికారులను సంప్రదించాలని దక్షిణ పశ్చిమ రైల్వే సూచించింది. అయితే విదేశీ పర్యాటకులు, ఎన్నారై ప్రయాణికులకు మాత్రం ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుకింగ్ చేసుకునే అవకాశం కొనసాగుతుంది.
