
భారత్లో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం, విద్యుదీకరణ, దేశీయ బొగ్గు ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ.. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఇంధనాలపై ఆధారపడటం కూడా పెరుగుతుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) అంచనా వేసింది. పెరుగుతున్న ఆదాయాలు, పారిశ్రామిక అభివృద్ధి, పట్టణీకరణ, రవాణా, శీతలీకరణ అవసరాల నేపథ్యంలో దేశంలో ఇంధన వినియోగం వేగంగా పెరగనుందని వెల్లడించింది.
ప్రపంచ సగటు కంటే మూడు రెట్లు అధికంగా..
ఐఈఏ రూపొందించిన ‘స్టేటెడ్ పాలసీస్ సినారియో’ (స్టెప్స్) ప్రకారం.. 2035 వరకు భారత్లో ఇంధన డిమాండ్ ఏటా సగటున 2.5 శాతం పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రపంచ సగటు వృద్ధి రేటు కంటే దాదాపు మూడు రెట్లు అధికం. ఇదే సమయంలో దేశీయంగా ముడి చమురు ఉత్పత్తి సుమారు 20 శాతం తగ్గుతుందని సంస్థ అంచనా వేసింది. మరోవైపు రిఫైనరీల శుద్ధి సామర్థ్యం రోజుకు 1 మిలియన్ బ్యారెళ్ల మేర పెరగనుంది. దీంతో విదేశాల నుంచి ముడి చమురు దిగుమతుల అవసరం మరింత పెరిగే అవకాశం ఉంది.
చమురు, సహజ వాయువు వినియోగంలో భారీ పెరుగుదల
ఐఈఏ ‘వరల్డ్ ఎనర్జీ ఔట్లుక్ 2026’ నివేదిక ప్రకారం.. 2035 నాటికి భారత్లో చమురు డిమాండ్ రోజుకు 1.3 మిలియన్ బ్యారెళ్ల మేర పెరగనుంది. వర్ధమాన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో నమోదయ్యే మొత్తం చమురు డిమాండ్ వృద్ధిలో ఇది సగానికి సమానం.
2025లో రోజుకు 5.6 మిలియన్ బ్యారెళ్లుగా ఉన్న దేశ చమురు వినియోగం.. 2035 నాటికి 7.5 మిలియన్ బ్యారెళ్లకు చేరుతుందని అంచనా వేసింది. సహజ వాయువు వినియోగం కూడా ఇదే కాలంలో 69 బిలియన్ క్యూబిక్ మీటర్ల నుంచి 137 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పెరగనుంది.
ప్రపంచంలో నాలుగో అతిపెద్ద రిఫైనరీ సామర్థ్యం
2025 నాటికి భారత్లో రోజుకు సుమారు 6 మిలియన్ బ్యారెళ్ల చమురు శుద్ధి సామర్థ్యం ఉందని ఐఈఏ తెలిపింది. ప్రపంచంలో అత్యధిక రిఫైనరీ సామర్థ్యం కలిగిన దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంది. దీనికి అదనంగా రోజుకు 8.4 లక్షల బ్యారెళ్ల సామర్థ్యంతో కొత్త రిఫైనరీ ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతోంది. ఇంధన వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ ఉత్పత్తిని విస్తరించడంతో పాటు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం భారత్కు కీలకంగా మారనుంది.
