
D Educt: Nov 7: విద్యార్థులు, యువతకు ఏఐ నైపుణ్యాలు.. రాష్ట్రంలో 50 లక్షల మందికి శిక్షణ లక్ష్యం!
రాష్ట్రంలోని విద్యార్థులు, యువతకు కృత్రిమ మేధ (ఏఐ) నైపుణ్యాలు అందించేందుకు విద్యాశాఖ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా కోటి మంది ఏఐ నిపుణులను తయారు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా, రాష్ట్రం నుంచి 50 లక్షల మందిని నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది.
కేవలం సర్టిఫికెట్ కోర్సులతో సరిపెట్టకుండా ఏఐని విద్యా ప్రణాళికలో భాగం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే ఆరో తరగతి సిలబస్‌లో మార్పులు చేసి ఏఐ పాఠాలను ప్రవేశపెట్టనున్నారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు ఏఐకి సంబంధించిన ప్రాథమిక అంశాలపై అవగాహన కల్పించనున్నారు.
అన్ని రంగాల్లో ఏఐ పాఠాలు
హెల్త్‌కేర్, కామర్స్, న్యాయవిద్య, ఐటీఐ ట్రేడ్లు తదితర కోర్సుల్లో ఆయా రంగాలకు సంబంధించిన ఏఐ అంశాలను సిలబస్‌లో చేర్చనున్నారు. సాంకేతికత వేగంగా మారుతున్న నేపథ్యంలో ఉన్నత విద్యలో పుస్తక పరిజ్ఞానంతో పాటు ప్రాక్టికల్ శిక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇందుకోసం స్వయంప్లస్తో పాటు ప్రముఖ ఐటీ, సాంకేతిక సంస్థల భాగస్వామ్యంతో డైనమిక్ అభ్యసన విధానాన్ని అమలు చేయనున్నారు.
విద్యార్థులు పూర్తి చేసిన ఏఐ కోర్సులకు మార్కుల జాబితాలో అధికారికంగా క్రెడిట్లు కేటాయించనున్నారు. ఇప్పటికే డిగ్రీ, ఇంజినీరింగ్ సిలబస్‌లో ఏఐని ప్రవేశపెట్టగా, డిగ్రీలో దీనికి 8 క్రెడిట్లు కేటాయించారు.
ముందుగా ఉపాధ్యాయులకు శిక్షణ
విద్యార్థులు, యువతకు ఏఐ నైపుణ్యాలు అందించే ముందు ఉపాధ్యాయులు, అధ్యాపకులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే ఉన్నత విద్యాసంస్థల్లోని అధ్యాపకులు స్వయంప్లస్, ప్రైవేటు సంస్థలు అందించే ఆన్లైన్ ఏఐ సర్టిఫికెట్ కోర్సులను అభ్యసించాలని ఉన్నత విద్యాశాఖ సూచించింది.
50 లక్షల మందికి శిక్షణ ఇలా..
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న 50 లక్షల మంది ఏఐ నిపుణుల లక్ష్యాన్ని వివిధ విద్యార్థి, యువజన వర్గాల ద్వారా చేరుకోవాలని ప్రణాళిక రూపొందించింది.
- పాఠశాల విద్యాశాఖ ద్వారా 8 నుంచి 10వ తరగతి చదివే 14 లక్షల మంది విద్యార్థులు.
- విశ్వవిద్యాలయాలు, స్వయంప్లస్ ద్వారా ఉన్నత విద్య అభ్యసించే 10 లక్షల మంది.
- ఇంటర్మీడియట్ విద్యార్థులు 6.50 లక్షల మంది.
- పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థులు 3.50 లక్షల మంది.
- నిరుద్యోగ యువత, ఎంఎస్ఎంఈ నిపుణులు, ఇతర వర్గాలకు చెందిన 16 లక్షల మంది.
ఈ కార్యక్రమం ద్వారా పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు ఏఐ నైపుణ్యాలను అందించి, భవిష్యత్తు సాంకేతిక అవసరాలకు అనుగుణంగా యువతను సిద్ధం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
