కడప జిల్లాలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయాలు సాధించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలోనూ కూటమి అభ్యర్థులు సత్తా చాటారు. పులివెందుల మైదుకూరు జడ్పీటీసీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది.

పులివెందుల జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి భారతి 1,463 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మైదుకూరు జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి కృష్ణకిషోర్ 18,903 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక పులివెందుల నియోజకవర్గ పరిధిలోని మొత్తం 65 ఎంపీటీసీ స్థానాల్లో 64 స్థానాలను కూటమి దక్కించుకుంది.

వేంపల్లి మండలం రెడ్డిపల్లి ఎంపీటీసీ స్థానానికి మాత్రమే ఎన్నిక జరిగింది. అలిరెడ్డిపల్లిలో టీడీపీ అభ్యర్థి 29 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మరోవైపు బద్వేల్ నియోజకవర్గంలోని కాశినాయన మండలం జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి ఓబులమ్మ ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిపై 8,391 ఓట్ల భారీ ఆధిక్యంతో ఆమె గెలుపొందారు.

ఇక చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలోనూ టీడీపీ అభ్యర్థులు పలు ఎంపీటీసీ స్థానాల్లో విజయాలు నమోదు చేశారు. ఇక్కడ వైసీపీ ఒక్క స్థానంలోనూ ఖాతా తెరవలేకపోయింది. రామకుప్పం మండలం మనేంద్రం ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి 712 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కుప్పం మండలం నడుమూరులో 1,166 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు.

అలాగే శాంతిపురం మండలం సి.బండపల్లిలో టీడీపీ అభ్యర్థి 718 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా మొరసనపల్లిలో 494 ఓట్ల ఆధిక్యంతో మరో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఫలితాలతో కడప చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో స్థానిక రాజకీయ సమీకరణాలు మారినట్లు కనిపిస్తోంది.

By Rajini