
తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు, మంత్రులతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవాలపై చర్చించారు. గ్రామాల అభివృద్ధికి దోహదపడేలా పంచాయతీల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని మంత్రులకు సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ఇటీవల జరిగిన మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు ప్రజాభిప్రాయానికి అద్దం పట్టాయని చంద్రబాబు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనకు ఈ విజయాలు గుర్తింపు అని అభివర్ణించారు. ప్రజలు కూటమిపై విశ్వాసం ఉంచారని పార్టీ గుర్తులపై జరిగిన ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు.
స్థానిక ఎన్నికల్లో వచ్చిన ప్రజా తీర్పును జీర్ణించుకోలేక ప్రతిపక్షం తప్పుడు ప్రచారానికి పాల్పడుతోందని చంద్రబాబు విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని ఓట్ల రూపంలో మలచుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగవని ఈ నేపథ్యంలో ఏకగ్రీవాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహక నిధుల వివరాలను ప్రజలకు తెలియజేయాలన్నారు.
ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలు:
- 5 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15 లక్షలు.
- 5 వేల నుంచి 10 వేల జనాభా ఉన్న పంచాయతీలకు రూ.25 లక్షలు.
- 10 వేలకుపైగా జనాభా ఉన్న పంచాయతీలకు రూ.50 లక్షలు.
గ్రామస్థులందరి అంగీకారంతో ఏకగ్రీవ ఎన్నికలు జరిగితే ప్రభుత్వం అందించే నిధులతో అభివృద్ధి పనులు చేపట్టవచ్చని చంద్రబాబు వివరించారు. ఈ అవకాశాన్ని ప్రజలకు తెలియజేసి ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని కోరారు.
అదే సమయంలో పార్టీలో నాయకుల మధ్య వ్యక్తిగత పంతాలు అహంకారాలకు తావివ్వకూడదని స్పష్టం చేశారు. నేతలంతా సమన్వయంతో ఐక్యంగా పనిచేస్తూ కూటమి విజయానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.
