కర్నూలు రూరల్‌ బ్యూరో,  రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సాగు, తాగునీటితో పాటు పరిశ్రమలకు అవసరమైన నీటిని అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ అన్నారు. నదుల అనుసంధానం ద్వారా కృష్ణా, గోదావరి జలాలను రాష్ట్రవ్యాప్తంగా మళ్లించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

బుధవారం కర్నూలులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసి నాలుగు జిల్లాల ప్రజల చిరకాల కలను చంద్రబాబు సాకారం చేశారని పేర్కొన్నారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు అందడంతో పలు జిల్లాలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.

ప్రాజెక్టుల పూర్తికి ‘క్యాలెండర్‌’

వచ్చే ఐదేళ్లలో రూ.35,314 కోట్లతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పట్టాభిరామ్‌ తెలిపారు. వీటిలో 14 ప్రాజెక్టులు రాయలసీమకు చెందినవేనని, ఈ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు తగిన నిధులు కేటాయించలేదని విమర్శించారు. జగన్‌ ప్రభుత్వం జీఓ నంబర్‌ 360 ద్వారా సుమారు 102 ప్రాజెక్టులను రద్దు చేసిందని ఆరోపించారు.

తుంగభద్రకు 33 కొత్త గేట్లు

తుంగభద్ర డ్యామ్‌ గేట్ల ఘటన అనంతరం కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాల సహకారంతో 33 కొత్త గేట్లను ఏర్పాటు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. తుంగభద్ర జలాలను రాయలసీమ అవసరాలకు సమర్థంగా వినియోగించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

చంద్రబాబు జలయజ్ఞాన్ని అమలు చేస్తుంటే, గత పాలకులు దానిని ధనయజ్ఞంగా మార్చారని విమర్శించారు. జగన్‌ ఇకనైనా చంద్రబాబుపై విమర్శలు మానుకోవాలని, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని పట్టాభిరామ్‌ అన్నారు.

సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, పి. నాగరాజ్‌ యాదవ్‌, పర్వీన్‌ తాజ్‌, డి. జేమ్స్‌, సోమిశెట్టి నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *