
రానున్న పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని ప్రజలకు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ప్రజలు అందించిన మద్దతు స్ఫూర్తిని పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని కోరారు.
రాజధాని అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో కూటమి భాగస్వామ్య పార్టీల నేతలు నాదెండ్ల మనోహర్ పీవీఎన్ మాధవ్‌తో కలిసి పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించి ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ అరాచకాలను అడ్డుకున్నామని పేర్కొన్నారు. పులివెందులలో తొలిసారిగా ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.
జనసేన నేత, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి సాధించిన విజయ స్ఫూర్తిని పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని ఆకాంక్షించారు. కూటమి ఐక్యతను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు జనసేన శ్రేణులు పనిచేస్తున్నాయని చెప్పారు.
సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వస్తున్న యువతకు స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలు అవకాశాలు కల్పిస్తున్నాయని వివరించారు. పంచాయతీ ఎన్నికలతో పాటు రెండో దశ మున్సిపల్ ఎన్నికల్లోనూ కూటమిని ఆశీర్వదించి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో మూడు తుపాన్లు రాష్ట్రాన్ని ప్రభావితం చేసినప్పటికీ ప్రజలు తమ తీర్పును స్పష్టంగా వెల్లడించారని అన్నారు.
ఇప్పటివరకు ప్రజలు అందించిన మద్దతుతో తమపై బాధ్యత మరింత పెరిగిందని పేర్కొన్నారు. ‘సేవా సంకల్ప్’ స్ఫూర్తితో ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు సాగుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలనకు నిదర్శనంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు.
ప్రభుత్వ పనితీరు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం కొనసాగిస్తూ రానున్న పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతామని మూడు పార్టీల నేతలు స్పష్టం చేశారు.
