చాలా మంది పూజల సమయంలో లేదా గుడికి వెళ్లినప్పుడు కొట్టిన కొబ్బరికాయను ఇంటికి తీసుకొస్తుంటారు. కొబ్బరి తీసుకున్న తర్వాత మిగిలే చిప్పలు, పీచును మాత్రం పనికిరావని భావించి డస్ట్‌బిన్‌లో పడేస్తుంటారు. అయితే ఇకపై అలా చేయాల్సిన అవసరం లేదు. కొబ్బరి చిప్పలు, పీచును ఇంట్లోనే ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా మొక్కల పెంపకం, ఇంటి అలంకరణ, ఇతర గృహ అవసరాలకు ఇవి ఉపయోగపడతాయి. మరి కొబ్బరి చిప్పలు, పీచుతో ఏయే పనులు చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బరి పీచును సాధారణంగా వ్యర్థంగా పడేస్తుంటాం. కానీ దీనిని ఇంట్లోనే పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ధూప్‌స్టిక్‌ తయారీకి కూడా కొబ్బరి పీచును వినియోగించవచ్చు. ఇందుకోసం ముందుగా పీచును బాగా ఎండబెట్టి చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. అనంతరం ఎండిన పూలు, లవంగాలు, దాల్చిన చెక్క, గంధం పొడి వంటి పదార్థాలను మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఇందులో కొద్దిగా కర్పూరం, నెయ్యి, తేనె కలిపి మిశ్రమాన్ని ధూప్‌కడ్డీల ఆకారంలో తయారు చేసుకోవాలి. వాటిని పూర్తిగా ఆరబెట్టిన తర్వాత ఉపయోగిస్తే ఇంట్లో సువాసన వెదజల్లుతుంది.

అంతేకాదు.. కొబ్బరి పీచును పాత్రలు, కిచెన్‌ సింక్‌ వంటి వాటిని శుభ్రం చేయడానికి స్క్రబ్బర్‌గా ఉపయోగించవచ్చు. దీని గరుకు నార మొండి మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే మొక్కల చుట్టూ మల్చింగ్‌గా పరచడం ద్వారా మట్టిలో తేమ ఎక్కువసేపు నిలిచి ఉండేలా చేయవచ్చు. కొబ్బరి పీచును ప్రాసెస్‌ చేసి కోకోపీట్‌ తరహాలో గార్డెనింగ్‌లోనూ ఉపయోగించుకోవచ్చు. ఇలా ఇంట్లో లభించే కొబ్బరి పీచును పడేయకుండా పలు అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.