న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి: పి. మురళి

తిరుపతి సిటీ, : ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు బ్యాంకు ఉద్యోగులు, అధికారుల సంఘాలు చేపడుతున్న మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెకు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా సీపీఐ తిరుపతి జిల్లా కార్యదర్శి పి. మురళి మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులు, అధికారుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యాలు సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బ్యాంకుల్లో వారానికి ఐదు రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు చాలాకాలంగా కోరుతున్నప్పటికీ సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం లభించలేదన్నారు. ఉద్యోగులపై పనిభారం పెరుగుతున్న నేపథ్యంలో వారి సంక్షేమం, మెరుగైన పని పరిస్థితులు, పెన్షన్‌కు సంబంధించిన సమస్యలు, పెండింగ్‌లో ఉన్న సేవా సంబంధిత సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.

ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పి. మురళి అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయడంతో పాటు వాటిలో పనిచేస్తున్న ఉద్యోగుల హక్కులు, ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సీపీఐ శ్రేణులు సంపూర్ణ సంఘీభావం తెలియజేస్తాయని తెలిపారు. కార్మికుల న్యాయమైన హక్కుల కోసం జరిగే పోరాటాలకు పార్టీ అండగా ఉంటుందని పి. మురళి స్పష్టం చేశారు.

By Ramya