ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక మార్పులు చేపడుతోంది. ఇందులో భాగంగా మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్తను మార్చింది. బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డిని కొత్త సమన్వయకర్తగా నియమించింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమిరెడ్డికి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.

ఇప్పటివరకు మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరించిన దొంతిరెడ్డి వేమారెడ్డిని తప్పించి.. ఆయన స్థానంలో వేణుగోపాల సోమిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. సోమిరెడ్డి మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నట్లు సమాచారం. కీలకమైన మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నట్టుండి సమన్వయకర్తను మార్చడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం

అమరావతి పరిధిలోని మంగళగిరి నియోజకవర్గానికి రాజకీయంగా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో మంగళగిరిలో వైసీపీ చేపట్టిన తాజా మార్పుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేయగా.. ఆర్కే ఆయనపై విజయం సాధించారు. ఆ సమయంలో ఆర్కే గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని వైఎస్ జగన్ ప్రకటించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత ఆర్కేకు మంత్రి పదవి దక్కలేదు.

ఆర్కే రాజకీయ ప్రయాణంలో కీలక మలుపులు

2023 డిసెంబర్‌లో ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్సార్‌సీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామం అప్పట్లో రాజకీయంగా సంచలనం సృష్టించింది. అనంతరం 2024 జనవరిలో వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అయితే కొద్ది రోజులకే ఆర్కే తిరిగి వైఎస్సార్‌సీపీలోకి వచ్చారు. 2024 ఫిబ్రవరి 20న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన మళ్లీ వైసీపీ కండువా కప్పుకున్నారు. తాజాగా మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా వేణుగోపాల సోమిరెడ్డిని నియమించడంతో నియోజకవర్గ వైసీపీ రాజకీయాల్లో మరోసారి మార్పు చోటుచేసుకుంది.

By Ramya