అక్వాన్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నెల్లూరు నుంచి విశాఖపట్నం వరకు విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తుపాను ప్రభావంతో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

తుపాను కారణంగా విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. అవసరమైన అదనపు సిబ్బందిని సమకూర్చుకునేందుకు తెలంగాణ మంత్రికి ఇప్పటికే లేఖ రాసినట్లు వెల్లడించారు. విద్యుత్ మరమ్మతులకు అవసరమైన సామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ప్రతి జిల్లాకు ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. గతంలో ఆర్నబ్, మురసు తుపానుల సమయంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అక్వాన్ తుపాను విషయంలోనూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు కూలిపోతే యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

శాఖాపరమైన నిర్లక్ష్యం కారణంగా ఎలాంటి నష్టం జరగడానికి వీల్లేదని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా ఎక్కడా ప్రాణనష్టం సంభవించకుండా విద్యుత్ సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా విద్యుత్ సరఫరా నిలిపివేసినా ఇతర కారణాలతో అంతరాయం ఏర్పడినా ప్రజలకు ముందుగానే సమాచారం అందించాలని గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్రంలోని మూడు డిస్కంల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరోవైపు బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా విద్యుత్ శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *