నాయుడుపేట మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యమే గెలిచిందని, ప్రజల తీర్పు ముందు అధికార దుర్వినియోగం నిలవలేకపోయిందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ విజయం సాధించిన నేపథ్యంలో మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ.. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచే అధికార పార్టీ నేతలు, కొందరు అధికారులు కలిసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నాయకులను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలను మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నాయకత్వంలో పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కొన్నాయని పేర్కొన్నారు.

పోలింగ్, కౌంటింగ్ సమయంలోనూ రీకౌంటింగ్ పేరుతో వివాదాలు సృష్టించి వైఎస్సార్‌సీపీ విజయాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారని విమర్శించారు. పదేళ్లపాటు ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేసిన కిలివేటి సంజీవయ్యను సైతం పోలీసులు వాహనాల్లో తిప్పుతూ ఇబ్బందులకు గురిచేయడం బాధాకరమన్నారు. ఇన్ని అడ్డంకులు ఎదురైనా తొలి రౌండ్ నుంచే స్పష్టమైన ఆధిక్యం సాధించి చివరకు విజయ ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నామని తెలిపారు.

నాయుడుపేట మున్సిపాలిటీ విజయం అక్కడి ప్రజలు, ఓటర్లు ఇచ్చిన తీర్పుకు నిదర్శనమని కాకాణి అభివర్ణించారు. పోలీసులు తమ విధులను పక్కనపెట్టి అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. పరిధి దాటి వ్యవహరించిన అధికారులపై భవిష్యత్తులో విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కీలకమైన నాయుడుపేట మున్సిపాలిటీని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోవడంలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎంపీ మద్దిల గురుమూర్తి, పార్టీ పరిశీలకుడు బిరుదువోలు శ్రీకాంత్ రెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్లు, ఇతర నాయకులు సమన్వయంతో కృషి చేశారని అభినందించారు. రాజేశ్వరమ్మ విజయాన్ని నాయుడుపేట ఓటర్లతోపాటు విజయం కోసం శ్రమించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రజాసేవలో అనుభవం కలిగిన రాజేశ్వరమ్మ కుటుంబం నాయుడుపేట పురపాలక సంఘాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తుందనే విశ్వాసం ఉందని కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ సమావేశంలో పార్టీ పరిశీలకుడు బిరుదువోలు శ్రీకాంత్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, జిల్లా కార్యదర్శి కామిరెడ్డి రాజారెడ్డి, నాయకులు తంబిరెడ్డి మోహన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కలికి మాధవరెడ్డి, దబ్బల శ్రీమంత్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కటకం దీపిక, ధనలక్ష్మి, మనోహర్ రెడ్డి, గోపిరెడ్డి, తంబిరెడ్డి సురేష్ రెడ్డి, తంబిరెడ్డి హేమకుమార్ రెడ్డితోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

By Ramya