మంగళగిరి: అర్నబ్‌ తుపాను ప్రభావం నుంచి రాష్ట్రం పూర్తిగా కోలుకోకముందే మురసు తుపాను ముప్పు పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు.

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం, బాపట్ల, కృష్ణా, తిరుపతి జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే హెచ్చరించాలని, లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, పోలీసు, రెవెన్యూ, విద్యుత్‌ శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

మురసు తుపాను తొలుత బాపట్ల-మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందని అంచనా వేయగా, ప్రస్తుతం దిశ మార్చుకుని నెల్లూరు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని, భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు సంభవించవచ్చని వివరించారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆరు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఏడు ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచారు.

తాగునీరు, విద్యుత్‌ సరఫరాకు ఆటంకం లేకుండా..

తుపాను సమయంలో గ్రామాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారు. విద్యుత్‌ స్తంభాలు కూలితే వెంటనే సరఫరా పునరుద్ధరించేలా సిబ్బందిని సిద్ధంగా ఉంచాలన్నారు. దెబ్బతిన్న గ్రామీణ రహదారులు, కల్వర్టులకు త్వరగా మరమ్మతులు చేపట్టాలని, రోడ్లపై కూలిన చెట్లను తొలగించాలని సూచించారు. ప్రమాదకరమైన రహదారులు, లోలెవల్‌ కాజ్‌వేల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

వాగులు, వంకల్లో నీటి ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించాలని, వరద ఉద్ధృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. గ్రామాల్లో పారిశుధ్యంపై దృష్టి సారించి, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. వర్షాలు తగ్గిన వెంటనే బ్లీచింగ్‌, క్లోరినేషన్‌ చేపట్టాలని సూచించారు.

మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు

తుపాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా చూడాలని పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారు. తీర ప్రాంత ప్రజలు బీచ్‌లకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని, అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

భారీ వర్షాలతో పంటలు నీట మునిగితే వెంటనే నీటిని బయటకు మళ్లించే ఏర్పాట్లు చేయాలని, రైతులకు ముందస్తు హెచ్చరికలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం జారీ చేసే సూచనలను ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేయాలని, తుపాను ముప్పు పూర్తిగా తొలగే వరకు ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని పవన్‌ కల్యాణ్‌ కోరారు.

By Ramya