తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సమాచారం అందించింది. దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అదే రోజు కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

దీపావళి రోజున ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు ఉన్న ఘంటా మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా సర్వభూపాల వాహనంపై గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. మరోవైపు సేనాధిపతి శ్రీ విష్వక్సేనులవారిని ప్రత్యేక పీఠంపై ఉంచి స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు, హారతి, ప్రసాద నివేదనలు నిర్వహిస్తారు.

సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొంటారు. అనంతరం నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఆర్జిత సేవలు రద్దు..

దీపావళి ఆస్థానం నేపథ్యంలో నవంబర్ 8న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనుంది. భక్తులు ఈ మార్పులను గమనించాలని టీటీడీ సూచించింది.

శ్రీవారి ట్రస్టులకు రూ.20 లక్షల విరాళం

మరోవైపు తిరుమల శ్రీవారికి హైదరాబాద్‌కు చెందిన దాతలు రూ.20 లక్షల విరాళం అందించారు. శ్రీనివాస సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు అందించింది. హైదరాబాద్‌కు చెందిన శ్రీ ధర్మ తేజ మరో రూ.10 లక్షలను బర్డ్ ట్రస్టుకు విరాళంగా ఇచ్చారు.

దాతల తరఫున టీటీడీ బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు విరాళాల డీడీలను తిరుమలలోని ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి అందజేశారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *