ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పిలుపునిచ్చారు. విజయవాడలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని మాట్లాడుతూ ఉదయం 7 గంటల నుంచే విజయవాడలో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరుగుతోందన్నారు. ఓటర్ల కోసం అధికారులు చక్కటి ఏర్పాట్లు చేశారని ముఖ్యంగా వృద్ధులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా వీల్‌చైర్లను అందుబాటులో ఉంచారని వెల్లడించారు.

సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని ఈలోగా అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఉదయం నుంచే వృద్ధులు పెద్ద సంఖ్యలో ఓటు వేసేందుకు వస్తుండటం శుభపరిణామమని పేర్కొన్నారు. యువత కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకు రావాలని సూచించారు.

గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ శాతానికి సమానంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లోనూ పోలింగ్ నమోదవుతుందని ఆశిస్తున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని తెలిపారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *