
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి పులివెందులతో సహా అన్ని ప్రాంతాల్లోనూ ఓటమి తప్పదని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అన్నారు. వైసీపీ కుట్రలు రాజకీయ డ్రామాలకు కాలం చెల్లిందని త్వరలోనే ప్రజాస్వామ్యం విజయం సాధించబోతోందని వ్యాఖ్యానించారు.
ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన జమ్మలమడుగుకు కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న తాను పులివెందులకు వెళ్లి గూండాయిజం చేయాల్సిన అవసరం ఏముందని వైసీపీ నేతలను ప్రశ్నించారు. జగన్కు అనుకూలంగా వ్యవహరించే మీడియా సంస్థల్లో తన పేరును పదేపదే ప్రస్తావించడం సరైన పద్ధతి కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు.
గతంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులోనూ నేరాన్ని తమపైకి నెట్టేందుకు ప్రయత్నించారని వైసీపీ నేతలపై ఆదినారాయణరెడ్డి ఆరోపణలు చేశారు. ఇప్పుడు పులివెందులలో జరుగుతున్న పరిణామాల్లోనూ వైసీపీ నేతలే గూండాయిజానికి పాల్పడి ఆ నిందను తమపై వేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలు ఇక సాగవని స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన సమాధానం చెబుతారని ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు.
