రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భావోద్వేగ ట్వీట్ చేశారు. తన రాజకీయ జీవితంలో నాలుగున్నర దశాబ్దాల కాలంలో 53 రోజుల జైలు నిర్బంధమే అత్యంత కఠినమైన సమయమని ఆయన గుర్తుచేసుకున్నారు.

సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజున 53 రోజుల నిర్బంధం అనంతరం రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. నంద్యాలలో అర్ధరాత్రి కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తనను అన్యాయంగా అరెస్టు చేశారని, నాటి పరిణామాలు ఇప్పటికీ తనకు చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయని తెలిపారు.

నాటి కుట్రలను ప్రజా మద్దతు తిప్పికొట్టింది!

అరెస్టు ద్వారా తనను ఒంటరిని చేయాలని కొందరు ప్రయత్నించారని, అయితే యావత్ తెలుగుజాతి నుంచి వచ్చిన మద్దతు ఆ ప్రయత్నాలను తిప్పికొట్టిందని చంద్రబాబు అన్నారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన కోట్లాది ప్రజల అభిమానాన్ని జీవితాంతం మరిచిపోలేనని పేర్కొన్నారు.

యువత నుంచి ఐటీ ఉద్యోగుల వరకు అండగా నిలిచారు

గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ‘సీబీఎన్ గ్రాటిట్యూడ్’ కార్యక్రమంలో వేలాది మంది యువత, ఐటీ ఉద్యోగులు పాల్గొని తనకు మద్దతుగా నిలవడం ఎంతో ప్రత్యేకమని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని సామాన్య మహిళల నుంచి అంతర్జాతీయ స్థాయి కార్పొరేట్ సంస్థల సీఈవోల వరకు అనేక మంది స్వచ్ఛందంగా తనకు మద్దతు ప్రకటించారని తెలిపారు.

నిజం గెలవాలంటూ ప్రజల్లోకి వెళ్లిన భువనేశ్వరి

తన సతీమణి నారా భువనేశ్వరి, కుటుంబ సభ్యులు ‘నిజం గెలవాలి’ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారికి ప్రజలు అండగా నిలిచారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో నిజం గెలిచిందని, ధర్మం నిలబడిందని వ్యాఖ్యానించారు.

ఆ క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తన కోసం నిలిచిన ప్రజల కోసం చివరి వరకు నిలబడతానని స్పష్టం చేశారు.

“మీ నమ్మకం, అభిమానం నా బలం.. మీ భవిష్యత్తే నా సంకల్పం” అంటూ చంద్రబాబు తన ట్వీట్‌లో భావోద్వేగంగా పేర్కొన్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *