స్వదేశీ నావిగేషన్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా మరో కీలక ముందడుగు పడిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రెండో తరం నావిగేషన్ ఉపగ్రహం ఎన్‌వీఎస్-03ను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగం దేశీయ నావిగేషన్ వ్యవస్థ ‘నావిక్’ (NavIC) సామర్థ్యాలను మరింత పెంచుతుందని పేర్కొన్నారు.

ఈ మేరకు శనివారం ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ స్పందించారు. మెరుగైన సామర్థ్యాలతో రూపొందించిన ఎన్‌వీఎస్-03 ఉపగ్రహం కీలక సాంకేతిక రంగాల్లో దేశ స్వావలంబనను మరింత ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. ప్రజలకు అవసరమైన నావిగేషన్ సేవలను మెరుగుపరచడంలో ఈ ఉపగ్రహం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

భారత అంతరిక్ష శాస్త్రవేత్తల అంకితభావం ప్రతిభ దేశానికి ఎప్పటికప్పుడు గర్వకారణంగా నిలుస్తున్నాయని కొనియాడారు. కాగా శుక్రవారం రాత్రి ఇస్రో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 రాకెట్ ద్వారా ఎన్‌వీఎస్-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. రెండో తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో భాగమైన ఈ ప్రయోగం ద్వారా దేశీయ నావిగేషన్ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.

ఎన్‌వీఎస్-03 సేవలు అందుబాటులోకి వస్తే రైళ్లు, వాహనాలు, రవాణా నౌకల కదలికలను రియల్ టైమ్‌లో మరింత కచ్చితంగా ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. తద్వారా రవాణా నావిగేషన్ సేవల్లో మెరుగైన కచ్చితత్వం సాధించేందుకు వీలవుతుంది.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *