
కోడూరు: కోడూరు మండల పరిధిలోని చింతకోళ్ల గ్రామంలో తాగునీటి ఇబ్బందులను పరిష్కరించేందుకు వాటర్ ట్యాంకర్ల ద్వారా క్రమం తప్పకుండా నీటి సరఫరా చేస్తున్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచన మేరకు కోడూరు టౌన్ జనసేన పార్టీ అధ్యక్షుడు కోట రాంబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది.
గ్రామంలో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని గురువారం ఉదయం 4 వేల లీటర్ల నీటిని వాటర్ ట్యాంకర్ ద్వారా సరఫరా చేశారు. సాయంత్రం మరో 4 వేల లీటర్ల తాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. దీంతో ఒక్క రోజులో మొత్తం 8 వేల లీటర్ల తాగునీరు గ్రామానికి అందుబాటులోకి రానుంది.
గత కొన్ని రోజులుగా చింతకోళ్ల గ్రామంలో తాగునీటి అవసరాలను గుర్తించి ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నట్లు కోట రాంబాబు తెలిపారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచనల మేరకు గత వారం రోజులుగా ఈ నీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని చెప్పారు.
ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మేరకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తామని రాంబాబు తెలిపారు. గ్రామంలో నీటి అవసరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, పరిస్థితికి అనుగుణంగా మరింత నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
