
అనంతపురం ప్రతినిధి, సెప్టెంబర్ 3: విద్యాసంస్థల పరిసరాల్లో అక్రమ వ్యాపారాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో అనంతపురం పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఆదేశాల మేరకు మూడో పట్టణ పోలీసులు, ఈగల్ సెల్ అధికారులు గురువారం ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’ నిర్వహించారు.
నగరంలోని 4వ రోడ్డు ప్రాంతంలో ఉన్న నేతాజీ హైస్కూల్, పీఆర్కే జూనియర్ కాలేజీ, సన్షైన్ హైస్కూల్ తదితర విద్యాసంస్థల చుట్టూ 500 మీటర్ల పరిధిలోని ఆరు కిరాణా దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని నిషేధిత వస్తువులు విక్రయిస్తున్న నాలుగు దుకాణాల యజమానులకు జరిమానా విధించారు.
విద్యాసంస్థల పరిసరాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ తనిఖీల్లో మూడో పట్టణ పోలీస్స్టేషన్ సిబ్బందితో పాటు ఈగల్ సెల్ ఎస్సై హనుమంతు ఆధ్వర్యంలోని బృందం పాల్గొంది.
