
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది ఖాళీ కానున్న శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక చర్యలు చేపట్టింది. కొత్త ఓటర్ల నమోదు ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియను పర్యవేక్షించేందుకు నలుగురు రోల్ అబ్జర్వర్లను నియమించింది.
తూర్పు-పశ్చిమ గోదావరి, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించి వివిధ జిల్లాల బాధ్యతలను నలుగురు అధికారులకు అప్పగించింది.
ఈ నియామకాల ప్రకారం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఎ.సూర్యకుమారికి కాకినాడ, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల బాధ్యతలు కేటాయించారు. కార్మిక శాఖ కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు పోలవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల ఓటర్ల జాబితా ప్రక్రియను పర్యవేక్షించనున్నారు.
అదేవిధంగా పురాతత్వ మ్యూజియాల శాఖ కమిషనర్ ముత్యాలరాజుకు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల బాధ్యతలు అప్పగించారు. ఏపీఎస్ఈబీ సీఈవో ఎస్.షాన్మోహన్ గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల రోల్ అబ్జర్వర్‌గా వ్యవహరించనున్నారు.
ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి సుమన్ కుమార్ దాస్ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయ నియోజకవర్గాల కొత్త ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ పారదర్శకంగా నిబంధనలకు అనుగుణంగా జరిగేలా ఈ అధికారులు పర్యవేక్షించనున్నారు.
